ఊహకందని 'రథసారథుల' వ్యూహాలు?
ప్రతి 30 కుటుంబాలకు ఒక సారథిని నియమించడంవల్ల వివరాలు సేకరించడం తేలికగా అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారథిని నియమించింది. దీనికి పోటీగా తెలుగుదేశం ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించింది. రానున్న రోజుల్లో జరగబోయే ప్రతి ఎన్నికలకు ఈ సారథులే కీలకంగా మారనున్నారు. ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించడం, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? వారు తెలుగుదేశం పార్టీయా? లేదంటే వైసీపీనా? వారికున్న సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరిస్తే మన పార్టీవైపు తిప్పుకోవచ్చు? ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలేమైనా ఉన్నాయా? గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులు కలిశారుకదా.. మీ అభిప్రాయం ఏమిటని వైసీపీ గృహసారథులు నివేదిక రూపొందిస్తున్నారు.

ఏం చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వనున్న చంద్రబాబు
ప్రతి 30 కుటుంబాలకు ఒక సారథిని నియమించడంవల్ల వివరాలు సేకరించడం తేలికగా అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ 30 కుటుంబాలు, అందులోని కుటుంబ సభ్యులందరిపై టీడీపీ సారథులు గ్రిప్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎంతగా అంటే.. వారి పుట్టు పూర్వోత్తరాల నుంచి వారు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగంతోపాటు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి పెట్టుకుంటారు. ఎన్నికల్లో టీడీపీవైపు ఉంటారా? వైసీపీ వైపు ఉంటారా? టీడీపీకి ఓటు వేయించాలంటే ఏం చేయాలి? వైసీపీ పార్టీవారైతే ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలన్నింటిపై వీరికి త్వరలోనే చంద్రబాబునాయుడు ఒక స్పష్టత ఇవ్వనున్నారు.

తమకు అనుకూలంగా మలచుకునేలా టీడీపీ, వైసీపీ?
సారథుల నియామకంవల్ల బూత్ ల వారీగా పోలింగ్ ఎలా నమోదువుతుంది? ఎలా నమోదైంది? భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఒక సారథికి అప్పజెప్పిన కుటుంబాలవారిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలంటే అనుసరించాల్సిన పద్ధతులు, ఏవిధమైన హామీలిచ్చి పార్టీకి ఓటు వేయించుకోవాలి? అంతేకాకుండా బూత్ ల వారీగా పోలైన ఓట్లను విశ్లేషిస్తే ఈ కుటుంబాలవారు ఎవరికి ఓటేశారు? ఎవరికి మెజారిటీ వచ్చింది? ఏ పార్టీవైపు మొగ్గుచూపారు? అనే విషయంలో ఇరు పార్టీల సారథులకు ఒక స్పష్టత వస్తుంది. ఈ వివరాలన్నింటినీ విశ్లేషించి అధిష్టానానికి నివేదిక పంపిస్తారు. సర్వేలో వీరు సేకరించిన వివరాలనుబట్టి ఆ కుటుంబాలను తమ పార్టీలవైపు మళ్లించుకునేలా భవిష్యత్తులో టీడీపీ, వైసీపీ వ్యూహాలు ఉండబోతున్నాయి.

ఎన్నికలకు కీలకం వీరే
రానున్న కాలంలో ఈ సారథుల పాత్రే ఎన్నికలకు కీలకంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక సారథిని వైసీపీ, ప్రతి 30 కుటుంబాలకు ఒక సారథిని టీడీపీ నియమించడంవల్ల భవిష్యత్తు రాజకీయాల్లో ఊహకందని మార్పులు చోటుచేసుకోబోతున్నాయని అంచనా వేస్తున్నారు. సారథుల నియామకంలో ఏ పార్టీది పై చేయిగా మారుతుందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. అప్పటివరకు ఈ సారథుల వ్యవహారాలను పరిశీలిస్తూ ఉండటమే.












Click it and Unblock the Notifications