చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
పొలంబాట పేరుతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ లో పర్యటించారు. ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకున్న కేసీఆర్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడంతోపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భూదాన్ పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే రూ.50వేల పరిహారం ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తాను కోరినట్లు తెలిపారు.
ఆ దుర్మార్గుడు, మూర్ఖుడు పట్టించుకోలేదని, తానే భిక్షాటన చేసి రూ.7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేశానని చెప్పారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకువచ్చామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని కోరుతున్న కేసీఆర్ ఈ పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఏం చేశారని, ఇప్పుడు వారంతా గుర్తుకువచ్చారా? అంటూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు తెలంగాణను వదిలిపెట్టి పది సంవత్సరాలవుతోందని, ఇప్పటికీ చంద్రబాబు పేరు స్మరించనిదే కేసీఆర్ కు పూట గడవడంలేదని, ఆ పార్టీ బతకాలంటే చంద్రబాబుపై విమర్శలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నెటిజన్లు మండిపడున్నారు. సామాన్యులను కలవడానికే ఏనాడూ ఇష్టపడని కేసీఆర్ ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications