వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్-హైకోర్టు కీలక నిర్ణయం..!
అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అప్రూవర్ దస్తగిరి (Dastagiri) ఇవాళ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. విచారణకు స్వీకరించింది.
గతంలో అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనా రద్దు మాత్రం కాలేదు. అయితే తాజాగా దస్తగిరికి వైఎస్సార్ జిల్లాలో బెదిరింపులు పెరిగాయి. దీంతో దస్తగిరి పదే పదే మీడియా ముందుకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.

అవినాష్, సునీతకు నోటీసులు
దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు అవినాష్ రెడ్డి, సునీతారెడ్డికి నోటీసులు జారీ చేసింది. గతంలో సునీతారెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారు. దీంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆమె అభిప్రాయం కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా విచారణ జరిపి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీబీఐ కూడా ఈ పిటిషన్ పై తమ అభిప్రాయం చెప్పబోతోంది.












Click it and Unblock the Notifications