వీడిన ఉత్కంఠ: టిడిపికి షాక్, ఐదో సీటు కూడా టిఆర్ఎస్‌దే
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గెలుచుకుంది. అధికారికంగా ఇంకా ఫలితాలు వెలువడలేదు. సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బిజెపి మద్దతుతో టిడిపి తరఫున వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగారు. రేవంత్ రెడ్డి పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయనను గెలిపించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అరెస్టు కూడా అయ్యారు.కాంగ్రెసు అభ్యర్థి ఆకుల లలిత సునాయసంగా విజయం సాధించారు.
టిఆర్ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావుతో పాటు నేతి విద్యాసాగర్, వెంకటేశ్వర్లు, యాదవ రెడ్డి విజయం సాధించారు. ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ మంత్రులు నాయని నర్సింహారెడ్డి, జగదీష్ రెడ్డి, తదితరులు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటేయడంతో, ప్రతిపక్షాల ఓట్లు ఐదు చెల్లకపోవడంతో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధ్యమైంది. మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ మోక్ పోలింగ్ ఏర్పాటు చేసి, తగిన శిక్షణ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యేల ఓట్లు కొన్ని చెల్లలేదని తెలుస్తోంది. టిడిపి ప్రధాన లక్ష్యంగా టిఆర్ఎస్ పావులు కదిపింది. దీంతో టిడిపికి ఓటమి తప్పలేదు.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. 118 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 16.86 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
కాగా, ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడ్డారు. దీంతో పోలింగ్ అనివార్యంగా మారింది. నాలుగు స్థానాలను గెలుచుకునే బలం గల తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఐదుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది. తెలుగుదేశం తరఫున ఒకరు, కాంగ్రెసు తరఫున ఒకరు పోటీ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యాయమూర్తి అనుమతితో ఆయన ఓటు వేశారు.

కాగా, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూ ఎసిబి పట్టుబడడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు మరో మలుపు తిరిగాయి.












Click it and Unblock the Notifications