ధిక్కారం: కిరణ్‌పై సోనియాకు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. గురువారం పార్లమెంటు సెంట్రల్ హాలులో సోనియాను వారు కలుసుకున్నారు. తెలంగాణపై మంత్రివర్గ నిర్ణయం తర్వాత తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వారు తెలిపారు.
అనంతరం కిరణ్ చేసిన ప్రసంగంపై ఫిర్యాదు చేశారు. కిరణ్ తీరు కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని, సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ప్రశ్నించేలా ఉందని వారు ఆమె దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. సోనియాను కలిసిన వారిలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులు కలిశారు.

కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు సహకరించబోమని, తాము తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ఓడిస్తామని, అలా ఓడించిన తర్వాత పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెసు అధిష్టానంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్, జగన్, చంద్రబాబు చెప్పారని విభజన చేస్తారా అని అడిగారు. తమ సంకల్పం సమైక్యాంధ్ర అని, అది నినాదం కాదు తమ విధానమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విభజనకు తాము ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోబోమని ఆయన అన్నారు. అవసరమైతో కెసిఆర్‌నో, జగన్‌నో, చంద్రబాబునో ముఖ్యమంత్రిని చేసుకోండి గానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని ఆయన కోరారు. కెసిఆర్ ఆడిగారనో, జగన్ చెప్పాడనో, చంద్రబాబు సహకరిస్తున్నాడనో విభజన చేయడమేమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications