TDP మహానాడు... అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
ప్రతి ఏడాది జరిగే తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడు ఈరోజు, రేపు రాజమండ్రిలో జరుగుతోంది. చంద్రబాబునాయుడుతోపాటు పార్టీ నాయకులంతా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1982లో టీడీపీ ఆవిర్భవించింది. ఆ తర్వాత నుంచి మహానాడును అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అసలు మహానాడును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎలా ఏర్పాటైంది? లాంటి వివరాలను తెలుసుకుందాం.
ఎన్టీఆర్ జయంతిరోజు : నందమూరి తారకరామారావు జయంతి మే 28ని మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో పార్టీ అజెండాతోపాటు వివిధ సమస్యలపై తీర్మానాలను ప్రకటిస్తారు. పార్టీ అధ్యక్షుడిని కూడా మహానాడులోనే ఎన్నుకోవడంతోపాటు వివిధ అజెండాలపై తీర్మానాలను ప్రకటిస్తారు. మళ్లీ మహానాడు జరిగేంతవరకు పార్టీ అనుసరించాల్సిన విధానాలను ఖరారు చేస్తారు.

అన్నివర్గాలకు ప్రాధాన్యమివ్వాలని : 1985లో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గంలో కూడా చీలికలు ఏర్పడ్డాయి. దీంతో ఎవరికివారుగా కొత్త పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలంటూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు కర్నూలులో భారీ సభను నిర్వహించారు. రెండురోజులపాటు ఇది జరిగింది. రెడ్డి సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభగా ప్రచారం జరిగింది. దీనికి పోటీగా అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ ఒక సభను ఏర్పాటు చేద్దామని పార్టీ ముఖ్య నాయకులకు ఎన్టీఆర్ సూచించారు.
అందరినీ కలుపుకుపోవడం : మహానాడు పేరు పెట్టడానికి కూడా అనేకరకాల చర్చలు జరిగాయి. మహా అంటే మొత్తం సమీకరించడం అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా కాస్తంత గంభీరంగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే పార్టీ తెలుగుదేశం అని, అందరికీ ఇదే విషయాన్ని చెప్పాలనే లక్ష్యంతో మహానాడును ఏర్పాటు చేశారు. ఒక దినపత్రిక అధినేత చేసిన సూచన మేరకు మహా అనే పదాన్ని తీసుకున్నారు. హానాడు అంటే అందరినీ కలుపుకుపోయే రోజు. మొదట్లో ఒకరోజే జరిగేది. తర్వాత మూడు రోజులకు పొడిగించారు. అప్పటి సందర్భాన్ని బట్టి రెండు రోజులు లేదంటే మూడురోజులు నిర్వహించేవారు. ఈ ఏడాది రెండురోజులు నిర్వహిస్తున్నారు. తొలి మహానాడు హైదరాబాద్ లోని గండిపేటలో నిర్వహించారు. ఎన్టీఆర్ నివాసంలోనే ఇది జరిగింది. తర్వాత రాష్టరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications