దళితులపై వ్యాఖ్యలు: రోజాపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్: దళితులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు అందింది. తెలుగుదేశం పార్టీ యువజన విభాగం తెలుగు యువత నేత దేవతోటి నాగరాజు ఫిర్యాదు చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశించింది.
రోజా వ్యాఖ్యలపై నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాతపై వైయస్సార్ కాంగ్రెసుపార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇటీవల ఆందోళనకు దిగారు. రోజా దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజా దళిత జాతిని అవమానించారని ఆరోపించారు. రోజాపై అట్రాసిటీకేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే రోజాపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని కడప తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తెలుగు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో కర్నూలులో రోజా దిష్టిబొమ్మను టీడీపీ కాక్యకర్తలు దగ్ధం చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్‌లో రోజా తీరుకు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఆమె పద్ధతి మార్చుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. రోజా ఎమ్మెల్యేగా అనర్హురాలని, అమెను సభ నుంచి బహిష్కరించాలని టీడీపీ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రిని కించపరిచిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా రోజాకు, పీతల సుజాతకు మధ్య మాటల యుద్ధం చెలరేగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications