నాడు జగన్ , నేడు టీ కాంగ్రెస్ - ఒక్క నినాదం, సీన్ ఛేంజ్..!!
తెలంగాణ ఎన్నికల సమయం కీలక దశకు చేరుకుంది. ఈ నెల 30న తెలంగాణ ప్రజలు ఎన్నికల తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజా తీర్పు పైన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంచుకున్న నినాదాలు ప్రజలకు దగ్గర చేసింది. నాడు ఏపీలో జగన్..నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల నినాదాలో ప్రజలను ప్రభావితం చేసినట్లు విశ్లేషణలు ఉన్నాయి.
హోరా హోరీ పోరు
తెలంగాణలో ఇక కీలకమైన పోలింగ్ కోసం సర్వం సిద్దమవుతోంది. కర్ణాటకలో గెలుపు తరువాత తెలంగాణ పైన ఫోకస్ చేసిన కాంగ్రెస్ తొలి నుంచి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లింది. కర్ణాటకలో ఓట్ల పంట పండించిన సంక్షేమ పథకాలను ఇక్కడ నేరుగా సోనియా ప్రకటించటం ద్వారా ఓటర్లను ఆకట్లుకొనే ప్రయత్నం చేసారు.

ఇదే సమయంలో కేసీఆర్ పాలన...వ్యవహార శైలిని టార్గెట్ చేస్తూ సాధారణ ప్రజలను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలు కొనసాగాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎన్నికల నినాదాలు ఎంచుకుంది. ఇవి ప్రచార సమయంలో ప్రజలను నేరుగా ఆకట్టుకొనే విధంగా ఉండటం.. ప్రజనాడి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందనే మౌత్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున ఉందనే అభిప్రాయం ఉంది.
నినాదాలతో ప్రజల్లోకి
కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో ఎంచుకున్న నినాదాల్లో మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి, బైబై కేసీఆర్, తిరగడబదాం తరిమికొడదాం వంటి వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జోరుగా ప్రచారం చేసారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేసారు.
బీఆర్ఎస్ ఈ వాదనతో విభేదిస్తోంది. తమ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య హోరా హోరీ ప్రచారం సాగింది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా క్షేత్ర స్థాయిలో తల పడుతున్నాయి. ప్రచారంలోనూ కాంగ్రెస్ అగ్రనేతలు తరలి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కీలక బాధ్యతలు తీసుకున్నారు.
సీన్ మార్చేస్తున్న స్లోగన్స్
2019 ఎన్నికల సమయంలో నాడు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇదే తరహా ఎన్నికల నినాదాలతో అధికారం దక్కించుకున్నారు. బైబై చంద్రబాబు, రావాలి జగన్.. కావాలి జగన్, జగన్ చెప్పాడంతే చేస్తాడంతే, జగనే రావాలి..జగనే కావాలి వంటి నినాదాలు ప్రజలను తాకాయి. ఏపీలో నాడు జగన్ కావాలి నినాదం ప్రతీ ప్రాంతానికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున తీసుకెళ్లారు.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సైతం మార్పు రావాలి- కాంగ్రెస్ రావాలని అనే నినాదం జోరుగా ప్రచారం చేసారు. ఇక, అధికారం తమదే ఖాయమని బీఆర్ఎస్ -కాంగ్రెస్ నేతలు పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్న వేళ..ప్రజలు ఎవరి పక్షాలన నిలబడతారో..ఎవరికి అధికారం అప్పగిస్తారేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications