న్యాయ వ్యవస్థపై కుట్రలా ఉంది - పెద్ద తలకాయలు ఉండే అవకాశం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీని వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. దీనిని న్యాయ వ్యవస్థపై కుట్రలా ఉందని వ్యాఖ్యానించింది. పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వారు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కొంత మంది న్యాయస్థానం ఇస్తున్న తీర్పుల విషయంలో న్యాయమూర్తుల పైన సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు.

పోస్టింగుల పై సీరియస్
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ పోస్టులు పెడుతున్న నేరగాళ్లను పట్టుకుని శిక్షపడేలా చూడాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 2020 మే 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కేసు దర్యాప్తులో విఫలమైంది. దీంతో దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని 2020 అక్టోబరు 12న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అక్టోబరు 2020న దర్యాప్తు సీబీఐకి బదిలీ చేసినా... పిటిషనర్లను అరెస్టు చేయడానికి సీబీఐకి ఏడాది పట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే పిటిషనర్లు ఎంత శక్తిమంతులో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.

కుట్ర వెనుక పెద్ద తలకాయలు
హైకోర్టు, సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టింగ్‌లను చూస్తుంటే 'న్యాయవ్యవస్థ'పై కుట్ర పన్నినట్లు భావించాల్సి వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు 2020 ఏప్రిల్ నుంచి పోస్టులు పెట్టారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంటే సామాజిక మాధ్యమాల్లో నిందితులు పెడుతున్న పోస్టులు... జడ్జిలపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు.
ఆ పోస్టులు న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉంది. దర్యాప్తు సీబీఐకి అప్పగించిన ఏడాది తర్వాత నిందితులను కనుగొని ఈ ఏడాది అక్టోబరు 21న అరెస్టు చేశారు. దీనినిబట్టి చూస్తుంటే పిటిషనర్లు చిన్న వ్యక్తులై ఉండొచ్చు.. కాని ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం లేకపోలేదు' అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
న్యాయమూర్తులను దూషిస్తూ పత్రికల్లో రాయలేని భాషతో పిటిషనర్లు పెట్టిన పోస్టులను న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో సవివరంగా ప్రస్తావించింది. ఆరోపణల తీవ్రత, మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరత, దర్యాప్తు ఇంకా తదిదశకు చేరుకోలేదని సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకొని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. న్యాయవ్యవస్థ, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై హైకోర్టు ఆదేశాలతో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేయగా... సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

బెయిల్ తిరస్కరణ
ఆ కేసులో ఏడో నిందితుడు గుంటూరు పట్టాభిపురానికి చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డి, ఎనిమిదో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన జలగం వెంకట సత్యనారాయణ(68 ఏళ్లు), ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన తొమ్మిదో నిందితుడు గూడ శ్రీధర్‌రెడ్డి, పన్నెండో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సుస్వరం శ్రీనాథ్, పదమూడో నిందితుడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దరిశ కిషోర్‌కుమార్‌రెడ్డి, పద్నాలుగో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సుద్దులూరి అజయ్ అమృత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కష్టడీలో ఉన్న నిందితులు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు.












Click it and Unblock the Notifications