ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఎటువైపు
AP Postal ballot 2024: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ఏపీలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్.. ఎటు వైపు మళ్లిందనేది చర్చనీయాంశమైంది.
రెండు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

అధికశాతం ఓట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొల్ అయినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో తమకు ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తోన్నారు. మెజారిటీ ఓటర్లు తమ పార్టీకి పట్టం కట్టినట్లు చెబుతున్నారు.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ఉద్యోగులను చిన్నచూపు చూడటం, వాళ్లకు జీతాలు ఎందుకు? అంటూ బహిరంగంగా అవహేళన చేయడం.. ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయని, అందుకే టీడీపీకి ఓటు వేయడానిి ఇష్టపడలేదని అంటున్నారు.
దీనితోపాటు వైఎస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తమకు లాభసాటిగా ఉంటుందని ఉద్యోగులు భావించారని అందుకే భారీ సంఖ్యలో ఓట్లు తమకే పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తోన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారని, మళ్లీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడ్డారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో, అందులో పొందుపరిచిన హామీలు, చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదని, రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా కూడా ఈ పథకాల అమలుకు ఒక మూలకు రాదని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురి అయ్యారని తెలుస్తోంది.
అలాంటపుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లిస్తారని, తమకు అసలు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి రావొచ్చని ఉద్యోగులు భయపడ్డారని, అందుకే వాళ్లంతా వైసీపీకి ఓటేశారనే వైసీపీ నాయకులు పేర్కొంటోన్నారు.












Click it and Unblock the Notifications