'ముద్రగడకు మద్దతు పలకడానికే వచ్చా!, ప్రజలు తిరగబడాల్సిన సమయమిది..'
చంద్రబాబు హామీలతో మోసపోయిన డ్వాక్రా మహిళలు, రైతులు, దళితులు, బలహీన వర్గాలు ఎవరైనా సరే ప్రభుత్వంపై తిరగబడి ఉద్యమాలు చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కిర్లంపూడి: గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు 600కి పైగా అబద్దపు హామిలిచ్చి అధికారంలోకి వచ్చారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అబద్దపు హామిలతో మోసపోయిన ఏపీ ప్రజానీకం ఇప్పుడిక ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
చంద్రబాబు హామీలతో మోసపోయిన డ్వాక్రా మహిళలు, రైతులు, దళితులు, బలహీన వర్గాలు ఎవరైనా సరే ప్రభుత్వంపై తిరగబడి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిసిన అనంతరం భూమన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన కాపు ఉద్యమానికి తన మద్దతు తెలిపారు. ముద్రగడ నిబద్దత కలిగిన వ్యక్తి అని, ఆయన్ను అభినందించడానికే కిర్లంపూడి వచ్చానని భూమన పేర్కొన్నారు.
కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండలేకే.. ప్రభుత్వంపై ముద్రగడ పోరాటం చేస్తున్నారని భూమన అభిప్రాయపడ్డారు. గత జనవరి 19న ముద్రగడ నిర్వహించిన సభకు హాజరై మద్దతు తెలిపినందుకు గాను తనను సంఘ విద్రోహ శక్తిగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

తాను చంద్రబాబులా హింసాయుత రాజకీయాలను ఎన్నడూ ప్రోత్సహించలేదని.. ఆయన కిరాతక చర్యలకు అంతుపొంతూ లేదని భూమన అన్నారు. రంగా హత్యలో బాబు పాత్ర గురించి అందరికీ తెలుసని, మామ ఎన్టీఆర్ మీదే చెప్పులు విసిరిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, పరిటాల రవీంద్రను అణగదొక్కడంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని హామి ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం పట్టించుకోవడం లేదని టీడీపీ ప్రభుత్వంపై భూమన మండిపడ్డారు. ముద్రగడ తీవ్రవాది కాదని, హింసారాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వారికుంటాయని, ముద్రగడ పోరాటానికి మద్దతు తెలపడానికే మరోసారి ఆయన్ను కలిశానని తెలిపారు.












Click it and Unblock the Notifications