మదనపల్లిలో ఉగ్రకలకలం: ముగ్గురి అరెస్ట్, రివాలర్ల సీజ్
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలో ఉగ్రవాదులున్నట్లు వచ్చిన వార్తలతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు.. ముగ్గురు అనుమానితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పోలీసులకు తిరగబడి పారిపోయినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి రెండు రివాల్వర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు నెలలుగా పారిశ్రామిక ప్రాంతంలోనే అనుమానితులు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని హైదరాబాద్‌కు తరలించారు. అనుమానితులందరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నేరస్తుల ముఠాగా అనుమానిస్తున్నారు. నిందితులపై 150కిపైగా కేసులున్నట్లు తెలిసింది. హుస్సేన్ అనే వ్యక్తి వీరికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది.

అయితే వారిని స్థానిక పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం. గతంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులను తమిళనాడుకు చెందిన పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. సుమారు మూడు నెలల క్రితం కాశ్మీర్ నుంచి వచ్చిన ఓ ఉగ్రవాదిని ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదులు చిత్తూరు జిల్లాను తమకు షెల్టర్లుగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు వైఫల్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అరెస్ట్ అయిన వ్యక్తులు వివాహా సంబంధాల కోసం వచ్చినట్లుగా చెప్పుకుని, ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications