తిరుమల కొండపైకి బైక్‌లకు నో ఎంట్రీ - దర్శనం, పార్కింగ్ పై టీటీడీ కీలక సూచనలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. కాగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడసేవ కు తిరుమల సిద్ధమైంది. ఈ సమయంలోనే టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో గరుడ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శనివారం గరుడ సేవ జరగడం ఒక విశేషమైతే పెరటాసి మాసం ప్రారంభమైన తర్వాత తొలి శనివారం ఇదే రోజు రావడం గమనార్హం. దీంతో తమిళులు పెద్ద సంఖ్యలో గరుడ సేవకు హాజరయ్యే ఆస్కారం ఉందని భావిస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు. తిరుమల ఆలయం చుట్టూ మాడవీధుల వెంట ఉన్న గ్యాలరీల్లో సుమారు 1.20లక్షల మంది పట్టే ఆస్కారం ఉంది. వాహన మండపం నుంచి స్వామి తొలుత శ్రీవారి ఆలయం ఎదురు నుంచి మాడ వీధుల్లో విహరిస్తారు. స్వామి వాహనం హథీరాంజీ మఠం దాటిన వెంటనే గొల్లమండపం, అఖిలాండం ముందు భాగంలో ఉన్న భక్తులను ఖాళీ చేయించి మరికొందరు భక్తులతో భర్తీ చేయించనున్నారు. అదేవిధంగా మాడ వీధుల్లో తాళ్లు వేసి స్వామి పక్క నుంచి మరికొందరు దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. సుపథంతోపాటు నైరుతి మూలన ఉన్న గేటు నుంచి స్వామి వాహనం పక్క నుంచి రెండు వరుసలు తాళ్లు వేయనున్నారు. అందులో నుంచి భక్తులను అనుమతించనున్నారు.

టీటీడీ కీలక సూచనలు
అదేవిధంగా మేదరమెట్ట, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించి అదనంగా మరి కొంత మందికి గరుడ వాహన దర్శనం చేయించనున్నారు. శ్రీవారి ఆలయంలో సైతం 30 శాతం అదనంగా స్వామివారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించారు. ప్రస్తుతం రోజుకు వేసే ట్రిప్పులకు అదనంగా మరో 500 వేయనున్నారు. ఆదివారం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్లపై అనుమతి లేదు. దీంతో స్థానికులు అనేకమంది ఆర్టీసీని వినియోగించుకుంటారు. తిరుపతి, తిరుమలలో వాహనాలకు అవసరమైన పార్కింగ్ సదుపాయం కల్పించారు. గరుడ సేవ రోజున గ్యాలరీలు, రహదారులు అన్నీ నిండిపోయి భక్తులు కొండ మీదకు రాలేని పరిస్థితి ఉన్నపప్పుడు కింద ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రద్దీ విపరీతంగా పెరిగిపోతే భక్తులను తిరుపతిలోని హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉండేలా చర్యలు చేపట్టారు. అక్కడ పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచారు. సిగ్నల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారించారు.













Click it and Unblock the Notifications
