తిరుమల వారికి టార్గెట్.. వారిని తన్ని తరిమేస్తారు!
టార్గెట్ తిరుమల తో వైసీపీ నాయకులు పని చేస్తున్నారు అని, తిరుమల పైన దుష్ప్రచారం చేయడం వారి లక్ష్యమని టిటిడి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. నేడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి టిటిడి కి సంబంధించి అనేక కీలక విషయాలపై మాట్లాడారు. నిబంధనలకు లోబడి జంగా కృష్ణమూర్తి స్థలం విషయాన్ని వ్యతిరేకించామని, అంతే తప్ప తమకు ఎవరిపైన వ్యక్తిగత కక్షలు లేవని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారితో పెట్టుకున్నందుకే వైసీపీ పరిస్థితి ఇలా
తిరుమల శ్రీవారి పైన వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, టిటిడి ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గోశాల నుంచీ గోవిందుడు వరకూ భూమన కరుణాకరరెడ్డి ఆధారాలు సృష్టించి మాపై అపచారాలు మోపుతున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్నందుకు వైసిపి నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని ఎద్దేవా చేశారు.

ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు
2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల ఆగ్రహం మాత్రమే కాదు తిరుమల వెంకన్న కూడా వారి పైన ఆగ్రహించాడు అని అన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, వైసిపి నాయకులకు లేదని అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరకామణి వ్యవహారంలో చెట్టు క్రింద పంచాయితీ చేశారని మండిపడ్డారు.
వైసీపీ పై వెంకన్న ఆగ్రహం, కూటమిపై అనుగ్రహం
గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు మాడి మసి అయ్యారన్నారు. దేశ ద్రోహం ఎంత తప్పో, స్వామీ ద్రోహం అంతే తప్పని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీకి, అనుగ్రహం కూటమికి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్న లోపాలు ఆసరాగా తీసుకుంటున్నారన్నారు. చట్ట పరిధిలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతోంది.. పంచభూతాలు సైతం వైసీపీ నాయకులను గమనిస్తున్నాయి అన్నారు.
ప్రజలు వారిని తన్ని తరిమేస్తారు
దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. 2014 నుంచీ 2019 వరకూ ధార్మిక క్షేత్రంలో దాపరికాలు నడిచాయని, ఇప్పుడు తాము ప్రతీది వెబ్ సైట్ లో ఉంచుతున్నామని అన్నారు. ముందు ముందు వైసీపీ ఇలానే వ్యవహరిస్తే ప్రజలు వారిని తన్ని తరిమేస్తారని బీజేపీ హెచ్చరిస్తోందన్నారు. రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications