తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు - శ్రీవారి దర్శనం :సేవల రద్దు..!!
తిరుమలలో నేటి నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి మాసంలో 114.29 కోట్ల హుండీ ఆదాయం టీటీడీకి సమకూరింది
Tirumala: తిరుమలలో గడిచిన ఫిబ్రవరి మాసంలో 114.29 కోట్ల హుండీ ఆదాయం టీటీడీకి సమకూరింది. ఫిబ్రవరి నెలలో 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 92.96 లక్షల లడ్డూలు పంపిణీ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 7.21 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 34.06 అన్న ప్రసాదం స్వీకరించినట్లు వెల్లడించారు. జూలై 2022లో తిరుమల హుండీ ఆదాయం రూ 139 కోట్లు కాగా, గత నెలలో అంతకు మించి హుండీ ఆదాయం భక్తుల నుంచి వచ్చింది. 2022 సంవత్సరంలో తిరుమల హుండీ ద్వారా రూ 1450.41 కోట్లు మేర సమకూరింది.

నేటి నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో నేటి నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఐదు రోజుపాటు ఈ తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల వేళ టీటీడీ వివిధ సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం లభించనుంది. తెప్పొత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఉంటుందని అధికారులు వెల్లడించారు. పుష్కరిణి చుట్టూ ఊరేగింపుగా భక్తలకు దర్శనం ఇస్తారు. రెండో రోజు శ్రీకృష్ణుడి అవతారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
సేవలను రద్దు చేస్తూ నిర్ణయం
మార్చి 3,4 తేదీల్లో తోమాల సేవను, ఆర్చన, సహస్రదీపాలంకరణ సేవను, అదేవిధంగా మార్చి 5,6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను, మార్చి 7వ తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శన కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 60,682 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications