గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి: రావి చెట్టు కూలి వ్యక్తి మృతి
తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ధ్వజస్తంభం వద్ద ఉన్న వందల ఏళ్లనాటి పెద్ద రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప(70)గా గుర్తించారు. గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారని.. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.
తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన గుర్రప్ప.. గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

భక్తుల భద్రత కోసం అలిపిరిలో వాహనాల ఫిట్ నెస్ తనిఖీ
తిరుమల ఘాట్ రోడ్ లో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్నెస్‌ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అలిపిరి చెక్ పోస్టు తోపాటు శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు, శ్రీనివాస సేతు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటుచేసే అంశంపై నివేదిక అందించాలని సివీఎస్వో ను ఆదేశించామన్నారు. అలిపిరి చెక్ పోస్టు లో వాహనాల తనిఖీ లో ఆలస్యం జరిగి భక్తులు అసహనానికి గురి కాకుండా ఉండడం కోసం వాహనాల తనిఖీ క్యూ లైన్ల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన చెప్పారు.
చెక్ పోస్టు లో విజిలెన్స్ సిబ్బంది బాగా తనిఖీలు చేస్తున్నారని, తిరుమలకు వాటర్ బాటిల్లు తీసుకుని వెళ్లకుండా మరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని సూచించారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత ఏడాది డిసెంబర్ లో పనులు ప్రారంభించారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్ కు ఫ్లైఓవర్ మొత్తం పూర్తికావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందని చెప్పారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జులై లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
అంతకు ముందు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గాలి గోపురం వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. భక్తుల కోసం గ్లోబల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సివి ఎస్వో హరి కిషోర్, మున్సిపల్ కమిషనర్ హరిత, టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, టీటీడీ ఐటి జి ఎం సందీప్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగస్వామి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications