Video : ప్రమాదవశాత్తు రైలు చక్రాల కింద పడబోయిన మహిళ... దేవుడిలా కాపాడిన రైల్వే కానిస్టేబుల్
తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన ఓ మహిళను ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె రైలు చక్రాల కింద పడబోగా... అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ఒక్క ఉదుటున ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
వివరాల్లోకి వెళ్తే... తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేసిన ఓ కుటుంబం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంది. అయితే నిద్రలోకి జారుకోవడంతో తిరుపతి స్టేషన్ వచ్చిన విషయాన్ని వారు గమనించలేదు. తీరా రైలు అక్కడినుంచి కదులుతున్న సమయంలో నిద్ర నుంచి మేల్కొన్నారు. హడావుడిగా రైలు దిగే ప్రయత్నం చేయగా... ఆ మహిళ కిందపడిపోయారు. ప్రమాదవశాత్తు రైలు చక్రాల కింద పడిబోతున్న ఆమెను అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ రక్షించాడు.

ఒక్క ఉదుటున అటువైపు దుంకిన అతను... ఆమెను వెంటనే ప్లాట్‌ఫాం పైకి లాగేశాడు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణ మధ్య రైల్వే శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది. మహిళ ప్రాణాలు కాపాడిన ఆ రైల్వే కానిస్టేబుల్ సతీశ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
గత నెలలో ముంబైలోని వంగణి రైల్వే స్టేషన్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు మరికొద్ది క్షణాల్లో ప్లాట్‌ఫాం మీదకు వస్తుందనగా ఓ చిన్నారి ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయింది. అక్కడే ఉన్న తల్లి భయంతో కేకలు పెడుతూ ఉండిపోయింది. విషయం గమనించిన పాయింట్స్‌మెన్ మయూర్ షెల్కే... ప్లాట్‌ఫాం పైకి రైలు దూసుకొస్తున్నప్పటికీ ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు పరిగెత్తాడు. క్షణాల్లో చిన్నారి వద్దకు పరిగెత్తి ఆమెను ప్లాట్‌ఫాం మీదకు విసిరేశాడు. ఆపై అతనూ ప్లాట్‌ఫాం మీదకు దూకాడు. అలా రెప్ప పాటులో ఆ రైల్వే ఉద్యోగి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రాణాలను సైతం లెక్క చేయక ఆ రైల్వే ఉద్యోగి చేసిన సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. అతని ధైర్య సాహసాలకు రైల్వే శాఖ రూ.50వేలు నజరానా అందించగా.. ఇందులో సగం డబ్బును ఆ చిన్నారి చదువుకు విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు.












Click it and Unblock the Notifications