కేరళ స్టైల్ "కొబ్బరి అన్నం".. నోరూరించే టేస్ట్ గ్యారంటీ !!
పచ్చి కొబ్బరి అంటే చాలా మందికి చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. తియ్యటి రుచి, సువాసనతో పాటు ఆరోగ్యానికి కూడా పచ్చి కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరితో ఏ వంట చేసినా ప్రత్యేకమైన రుచి వస్తుంది. ముఖ్యంగా పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి పాలు అయితే వంటలకు ప్రాణం పోస్తాయి. ఇవి రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన పోషకాలను అందిస్తాయి.
కొబ్బరి పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి.
ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా కొబ్బరి పాలు మంచి ఎంపికగా నిలుస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన కొబ్బరి పాలతో తయారుచేసే వంటల్లో 'కొబ్బరి పాల అన్నం' (Coconut Milk Rice) ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో తయారయ్యే ఈ వంటకం కావడంతో.. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో చేసుకునేందుకు చక్కగా సరిపోతుంది. ఈ కొబ్బరి అన్నం ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
- బియ్యం: 2 కప్పులు (బాస్మతీ లేదా సోనా మసూరి)
- తాజా కొబ్బరి పాలు: 4 కప్పులు (చిక్కటివి)
- పచ్చిమిర్చి: 4-5 (నడుమ చీల్చినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- హోల్ గరం మసాలా:
- లవంగాలు - 4
- యాలకులు - 2
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- బిర్యానీ ఆకు - 1
- జీడిపప్పు: 10-12
- నెయ్యి లేదా నూనె: 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు: రుచికి సరిపడా
- కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నం మెత్తగా, వాసనగా ఉడుకుతుంది.
- కుక్కర్‌లో లేదా మందపాటి గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి మరియు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈ దశలో మంచి సువాసన వస్తుంది.
- ఇందులో 4 కప్పుల తాజా కొబ్బరి పాలు పోసి, రుచికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- పాలు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని (నీరు వంపేసి) అందులో వేయాలి. మెల్లగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి.
- మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. సాధారణ పాత్రలో చేస్తే మూత పెట్టి అన్నం పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించాలి.
- ఆవిరి తగ్గాక మూత తీసి, పై నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుని మెల్లగా కలుపుకోవాలి.
- ఇప్పుడు గుమగుమలాడే కొబ్బరి పాల అన్నం రెడీ..
దీనిని వెజ్ కుర్మా, పన్నీర్ గ్రేవీ లేదా ఏదైనా మసాలా కూరతో తింటే రుచి రెట్టింపు అవుతుంది. ఆరోగ్యంతో పాటు రుచిని కూడా కోరుకునేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications