హైద్రాబాద్ మూడేళ్లు చాలు: జివోఎంకు టిజెఏసి మెయిల్
హైదరాబాద్: హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా మూడేళ్లు ఉంచితే చాలని, నగరంలో ఎవరికీ ప్రత్యేక రక్షణ అక్కరలేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదికను పంపించింది. శుక్రవారం రాత్రి ఐకాస జివోఎంకు 125 పేజీల నివేదికను పంపించింది.
నీటి వాడకానికి మానిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోను 371(డి) ఉంచాలని తమ నివేదికలో కోరారు. పదకొండు అంశాలపై మూడు రోజులపాటు కసరత్తు జరిపి, 125 పేజీల నివేదికను రూపొందించిన ఐకాస ఛైర్మన్ కోదండరాం శుక్రవారం రాత్రి 9 గంటలకు ఇ-మెయిల్ ద్వారా పంపారు.

మరోవైపు రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన జివోఎంకి సమర్పించే నివేదికలపై పారదర్శకత పాటించాలని తెలంగాణ ఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. సచివాలయంలో దేవీప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ జివోఎంకు రాష్ట్ర ప్రభుత్వం పలు నివేదికలను పంపినట్లు వార్తలొస్తున్నాయని, మరోవైపు ఈ నివేదికలకు సంబంధించి తమను ఎలాంటి సమాచారం ప్రభుత్వం అడగలేదని ఆయా శాఖల అధిపతులు చెబుతున్నారని అన్నారు.
దీంతో ఏ రకమైన నివేదికలను మంత్రుల కమిటీకి సమర్పించారోనని అయోమయం నెలకొందన్నారు. ఉద్యోగులకు సంబంధించి జివోఎంకు అందజేసే నివేదికల విషయమై పారదర్శకత పాటించాలని, ఆ అంశాలపై తమ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాలని డిమాండ్ చేశారు. 371డి నిబంధన విషయమై ముఖ్యమంత్రితో పాటు పలువురు సీమాంధ్ర ప్రాంత నేతలు సైతం గందరగోళాన్ని సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
విభజన జరిగితే 371డి రాజ్యాంగ నిబంధనను టెక్ట్చువల్ సవరణ చేస్తే చాలని అభిప్రాయపడ్డారు. 371డి నిబంధనపై పంపే ఎలాంటి నివేదిక అయినా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తరువాతనే పంపాలని కోరారు. విభజన వల్ల ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల పర్యవేక్షణ కమిటీని నియమించాలని మంత్రుల కమిటీకి ఇప్పటికే తెలంగాణ ఉద్యోగుల తరపున నివేదిక సమర్పించామన్నారు.












Click it and Unblock the Notifications