యూట్యూబ్ చూసి నెల్లూరు లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్; మర్మాంగం తొలగింపు.. ఆపై షాకింగ్ ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరులోని ఓ లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగ మార్పిడి ఆపరేషన్ చేసిన ఘటన విషాదంగా మిగిలింది. లింగ మార్పిడి ఆపరేషన్ లో భాగంగా మర్మాంగాన్ని తొలగించిన తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి ఓ వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

పెళ్లి చేసుకున్న ఏడాదికే భార్యకు విడాకులిచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్
వివరాల్లోకి వెళితే ఏపీ నుండి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన బి శ్రీకాంత్ అలియాస్ అమూల్య చిన్నప్పుడే చదువుకు స్వస్తి చెప్పి తాపీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళిన అతనికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహం చేశారు. అయితే వివాహమైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఏడాదికే వారు విడిపోయారు. చిన్నప్పటి నుండి అతనిలో ఆడ లక్షణాలు ఉండేవి. దీంతో భార్య అతడి నుండి విడిపోయింది.

ట్రాన్స్ జెండర్ మోనాలిసాతో పరిచయం; ఆపై లింగ మార్పిడి ఆలోచన
ఆ సమయంలో వైజాగ్ కు చెందిన ట్రాన్స్జెండర్ మోనాలిసా తో శ్రీకాంత్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. మొదటినుంచి ట్రాన్స్ జెండర్ లా లక్షణాలు ఉన్న శ్రీకాంత్ తాను లింగ మార్పిడి చేసుకుని పూర్తిగా ట్రాన్స్ జెండర్ గా మారిపోవాలని తన మనసులో ఉన్న కోరికను మోనాలిసా కు చెప్పాడు. ఆ తర్వాత గతేడాది ఆన్లైన్లో నెల్లూరుకు చెందిన మస్తాన్, జీవా అనే యువకులతో శ్రీకాంత్ కు పరిచయం ఏర్పడింది. వారికి కూడా శ్రీకాంత్ లింగమార్పిడి చేసుకుంటానని, ముంబై వెళతాను అని చెప్పాడు.

ముంబైలో ఖర్చు బాగా అవుతుందని, నెల్లూరు లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్
అయితే ముంబైలో ఆపరేషన్ చేసుకోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అని, తాము అతి తక్కువ మొత్తానికి ఆపరేషన్ చేస్తామని మస్తాన్, జీవా శ్రీకాంత్ కు చెప్పినట్టు సమాచారం. దీంతో వారి మాట నమ్మిన శ్రీకాంత్ ఆపరేషన్ కు సిద్ధమై నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓ లాడ్జిలో ఈనెల 23వ తేదీన మస్తాన్, జీవా, మోనాలిసా, శ్రీకాంత్ ఒక రూమ్ తీసుకున్నారు. 24న ఆపరేషన్ చేసి శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించారు.

మర్మాంగం తొలగింపు తర్వాత తీవ్ర రక్తస్రావం; శ్రీకాంత్ మృతి
మర్మాంగాన్ని తొలగించిన వెంటనే శ్రీకాంత్ కు తీవ్ర రక్తస్రావమైంది. మర్మాంగాన్ని తొలగించిన కొద్దిసేపటికే పల్స్ రేటు పడిపోయింది. వారు ఆ సమయంలో శ్రీకాంత్ ను కాపాడలేకపోయారు. దీంతో శ్రీకాంత్ ప్రాణాలు విడిచాడు. లాడ్జి గదిలో శ్రీకాంత్ మరణించిన విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరి పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేసినట్టు అనుమానాలు.. కేసు దర్యాప్తు
లింగ మార్పిడి ఆపరేషన్ చేస్తామని శ్రీకాంత్ ను నమ్మించి లాడ్జికి తీసుకు వచ్చిన వారు యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని ఆలోచన, దానికోసం మస్తాన్, జీవా మాటలు నమ్మి లాడ్జిలో ఆపరేషన్ కు సిద్ధమైన శ్రీకాంత్ అనాలోచిత నిర్ణయం చివరకు అతని ప్రాణాలు తీసింది. నిండు జీవితాన్ని బలిగొంది.












Click it and Unblock the Notifications