ఘర్షణపై స్పీకర్ ఆరా: టి బిల్లుకు పూజ, ఓయులో టెన్షన్

తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో, శాసన మండలిలో ప్రవేశ పెట్టడం అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంత నేతలు బిల్లును చించివేసి, దగ్ధం చేయగా, తెలంగాణ ప్రాంత నేతలు అడ్డుకున్నారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీనిపై స్పీకర్ ఆరా తీశారు. కాగా, తమను బయటి వారు వచ్చి కొట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తనను తోసివేశారని నన్నపనేని రాజకుమారిలు ఫిర్యాదు చేయగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలపై తెలంగాణ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ బిల్లుకు పూజలు
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో దానికి పూజలు చేశారు. సీమాంధ్ర ఎంపీలు చించివేసి, దగ్ధం చేయగా, తెరాస నేతలు పూజలు చేయడం గమనార్హం. మరోవైపు ఉద్రికతల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మీడియా పాయింటు వద్ద రెండు రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు.
ఓయులో ఉద్రిక్తత
హైదరాబాదు పైన గవర్నర్ పెత్తనం సహించబోమంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సోమవారం రాజ్ భవన్ ముట్టడి కోసం ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.












Click it and Unblock the Notifications