శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనలు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. సోమవారం నాడు 58,607 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,841 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.61 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

కాగా- తిరుమలలో శ్రీవారి దర్శన క్యూలైన్లను టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్యూలైన్లల్లో వేచివున్న భక్తులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లల్లో భక్తులకు మరింత మెరుగుపర్చాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీశారు.
తొలుత- అళ్వార్ ట్యాంక్ గెస్ట్‌హౌస్ (ఏటీజీహెచ్) వద్ద గల స్లాటెడ్ సర్వ దర్శనం క్యూలైన్లను పరిశీలించారు బీఆర్ నాయుడు. భక్తులతో మాట్లాడారు. అనంతరం నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం)ను తనిఖీ చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌లల్లో టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అందిస్తోన్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు భక్తులు తమ అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు. శ్రీవారి లడ్డూలు రుచికరంగా, నాణ్యతతో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన సమయం మరింత వేగంగా పూర్తయ్యేలా చేయాలని మరికొందరు భక్తులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. దర్శన విధానానికి సంబంధించి భక్తులు చేసిన పలు సూచనలను స్వీకరించారు. త్వరలో దర్శన విధానాలపై సమగ్రంగా సమీక్షించి, సదుపాయాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని భక్తులకు హామీ ఇవ్వడం జరిగింది.
క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని వారికి తెలియజేశారు. ఆకస్మిక తనిఖీల సమయంలో ఆయన వెంట టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications