కొత్త విధానంలోనే వసతి- శ్రీవారి లడ్డు టోకెన్లు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి..!!
తాజగా తీసుకున్న నిర్ణయాలతో భక్తులకు వసతితో పాటుగా లడ్డూ ప్రసాదం పంపిణీలో మేలు జరుగుతోందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
Tirumala: తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా తీసుకుంటున్న చర్యలను ఈవో ధర్మారెడ్డి వివరించారు. వసతి..దర్శనం..లడ్డూ టోకెన్ల జారీ విషయంలో కొత్త పద్దతి అమలు చేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ ఉత్సవాలు జరిగే సమయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో నిరీక్షణ లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం అందుతోంది.
తిరమలలో తాజాగా అమలు చేస్తున్న నిర్ణయాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న ''ఫేస్ రికగ్నిషన్" గురించి చెప్పుకొచ్చారు. భక్తులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తునికీ ముఖ గుర్తింపు చేసేలా అమలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే వారికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లడ్డూలు జారీ చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఈవో మరింత స్పష్టత ఇచ్చారు. ''ఫేస్ రికగ్నిషన్" సత్ఫలితాలు ఇస్తోందని ధర్మారెడ్డి వెల్లడించారు. నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. సర్వదర్శనం భక్తులకు ఈ విధానం ద్వారానే ఉచిత లడ్డు టోకెన్లను జారీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారని..భక్తులకు త్వరగతిన గదులు లభిస్తున్నాయని ఈవో వెల్లడించారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.ప్రస్తుతం తిరుమలలో రద్దీ బాగా తగ్గింది. బుధవారం శ్రీవారిని 60,391 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ 3.67 కోట్ల ఆదాయం సమకూరింది. కంపార్ట్ మెంట్స్ లో భక్తుల నిరీక్షణ ఉండటం లేద. నేరుగా శ్రీవారి దర్శనం అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications