తిరుమలలో వేసవి ఏర్పాట్లు ఇవే: రూ.100 కోట్లు దాటిన టీటీడీ హుండీ ఆదాయం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 62,624 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 32,638 మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.96 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. 30 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీడీపీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఏప్రిల్‌లో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడాయి. ఆ నెలలో 20 లక్షలమందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంగా 20.17 లక్షలమందికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం మరోసారి 100 కోట్ల రూపాయలను దాటేసింది. 101 కోట్ల 63 లక్షల రూపాయలుగా రికార్డయింది.
శ్రీవారికి తలనీలాలను సమర్పించి, తమ మొక్కులను చెల్లించుకున్న వారి సంఖ్య 8,08,000. అలాగే- 39.73 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఏప్రిల్ నెలలో కోటి వరకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించారు టీటీడీ అధికారులు. ఆ ఒక్క నెలలో విక్రయించిన లడ్డూల సంఖ్య 94.22 లక్షలు.
కాగా- ఈ వేసవి సెలవుల్లో తిరుమలను సందర్శించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉంటోన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తోన్నారు.
ఆలయ మాడ వీధులతో పాటు భక్తులు తిరుగాడే ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వారికి ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు వేశారు. చలువసున్నం, కార్పెట్లను సమకూర్చారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరడానికి తాత్కాలిక షెడ్లను నిర్మించినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications