టీటీడీ విప్లవాత్మక నిర్ణయం: ఆధార్ కార్డుతో లింక్..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. శనివారం నాడు 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.83 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగ్లా కాటేజీల వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది.

తిరుమలలో దళారుల వ్యవస్థను రూపుమాపడంపై టీటీడీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తు మొదలుపెట్టింది. శ్రీవారి దర్శనం టికెట్ల డూప్లికేషన్, నకలీ వెబ్‌సైట్లు పుట్టుకురావడం, ఆన్‌లైన్ దరఖాస్తులను మానిప్యులేట్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించింది.
ఇందులో భాగంగా- భక్తులకు అందించే ఆన్‌లైన్ సేవలన్నింటినీ కూడా ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు ఆదేశించారు.
ఆన్‌లైన్ సేవలను ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుందని చెప్పారు. ప్రస్తుతం టీటీడీ దర్శనం టికెట్ల జారీ, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసలుబాటు భక్తులకు ఉంది.
అయినప్పటికీ- దళారుల బెడద తప్పట్లేదని, వారిని నియంత్రించడానికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంపై అధ్యయనం చేయాలని శ్యామలరావు అన్నారు. దీనికోసం యూఐడీఏఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు సులభతరమౌతాయని అన్నారు.












Click it and Unblock the Notifications