TTD: శ్రీ గోవిందరాజ స్వామి తెప్పోత్సవాలు నేటినుండే: పుష్కరిణిలో విహరించనున్న స్వామి!!
ఫిబ్రవరి మాసం.. తిరుమల శ్రీవారికి, శ్రీవారి అనుబంధ ఆలయాలకు విశేషమైన మాసం. ఈ మాసంలో అనేక వేడుకలు తిరుమల తిరుపతి కేంద్రంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మార్చి 1 నుండి 10వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24న తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలలో గోవిందరాజ స్వామి వారి తెప్పోత్సవాలు కూడా ఒకటి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి అంటే నేటి నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించటం కోసం టీటీడీ ఏర్పాటు చేసింది. ఏడురోజుల పాటు సాయంత్రం 6.30నుండి రాత్రి 8గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజ పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు.

ఆ తరువాత గోవిందరాజ స్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను దర్శనం ఇస్తారు. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలను భక్తులపై ప్రసరింపజేస్తారు . ఫిబ్రవరి 17న శ్రీ కోదండరామస్వామివారు ఆలయ పుష్కరిణి లో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. 18న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు పుష్కరిణి జలాలలో విహరించి, ఆపై భక్తులను కరుణిస్తారు.
19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు దేవేరులతో కలిసి భక్తులకు దర్శనం ఇస్తారు.20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 21, 22, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు స్వయంగా తెప్పలపై భక్తులకు కనువిందు చేయనున్నారు. చివరి రోజు తెప్పోత్సవం అనంతరం ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు. ఈ తెప్పోత్సవాల వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసిన టీటీడీ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications