టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాల పంపిణీ- తేదీలు ఇవే..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 78,569 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,482 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 23 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

ఈ పరిస్థితుల మధ్య టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్ దారులకు అధికారులు శుభవార్త వినిపించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం రిటైర్డ్ ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దారులకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపినీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టనున్నారు. 24వ తేదీ వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లడ్డు, వడ ప్రసాదం అందజేస్తారు.
రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్ దారులు తమ టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డులను చూపించి.. ప్రసాదాలను స్వీకరించాల్సి ఉంటుంది. పింఛన్‌దారులు / వారి కుటుంబ పింఛన్ దారులు / సీపీఎస్ వారికి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ అందజేస్తారు. పీపీఓ నంబర్లవారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో 164 నుండి 5,500, 17వ తేదీన 5,501 నుండి 7,000, 18న 7,001 నుండి 8,500, 22న 8,501 నుండి 10,000, 23వ తేదీన 10,000 నుండి 12,500, 24వ తేదీన 12,500 నుండి మిగిలిన పీపీఓ నంబర్ల వారికి ప్రసాదాలు అందిస్తారు.
ప్రస్తుతం దీపావళి ఆస్థానం కోసం తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ నెల 20వ తేదీన దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థాన కార్యక్రమం ఏర్పాటవుతుంది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్పస్వామి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.












Click it and Unblock the Notifications