TTD లో కొత్త కొలువులు, ఖాళీల భర్తీ - అర్హతలు, ప్రమోషన్లు..!!
Tirumala: టీటీడీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీకి రంగం సిద్దం అవుతోంది. ఉద్యోగ నియమకాలతో పాటుగా ప్రమోషన్ల పైన నిర్ణయంతీసుకున్నారు. బర్డ్ ఆసుపత్రి, ఎస్వీ గోశాల, వైద్యవిభాగం, ఆలయ కైంకర్యాల విధుల్లో కీలక మార్పులు చేస్తూ తాజాగా టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే టీటీడీలో ఉద్యోగ నియామకాల పైన నిర్ణయం ప్రకటించనున్నారు.
టీటీడీలో ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఎస్వీ గోసంరక్షణ శాలలో అసిస్టెంట్ డైరెక్టర్ (2), గోశాల మేనేజర్ (2), డైరీ సూపర్ వైజర్ (6), డైరీ అసిస్టెంట్ (2) చొప్పున మొత్తం 12 పోస్టులను సృష్టించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాల కోసం పాలిటెక్నిక్ లో అనిమల్ హస్బెండరీ లేదా తత్సమాన అర్హతతో పాటు వెటర్నరీ అసిస్టెంట్‌గా 5 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య విభాగంలో 30 ఏళ్లుగా ఒకే హోదాలో పని చేస్తున్న సిబ్బంది విషయం లోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమోషన్ ఛానల్ లేక స్తబ్దుగా ఉన్న పలు పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయించారు. ఆధునిక ఎంఆర్‌ఐ, డిజిటల్ మమోగ్రఫీ వంటి పరికరాల నిర్వహణ కోసం ఉన్న రేడియోగ్రాఫర్ పోస్టును చీఫ్ రేడియోగ్రాఫర్ గా పెంచారు. ఫిజియోథెరపిస్ట్ పోస్టు కూడా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, తాళ్లపాక కైంకర్యపరుడు, మణ్యం దార్ పోస్టుల నియామక నిబంధనలను ఖరారు చేశారు. ఈ పోస్టులకు తమకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ వచ్చిన విజ్ఞప్తులను బోర్డు అంగీక రించలేదు. ఈ పోస్టుకు తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం సర్టిఫికెట్ ఉండాలి. 40 ఏళ్లు మించకూడదని స్పష్టం చేసారు. మణ్యం దార్ పోస్టుకు 8వ తరగతి పాసై, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. వీటితో పాటుగా బర్డ్ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఆర్థోపెడిక్స్ లేదా అనస్థీషియాలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అర్హతను నిర్ణయించారు. శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ప్రొడక్షన్ సూపర్‌వైజర్ పోస్టుకు బీఏఎంఎస్ లేదా బి.ఫార్మసీ (ఆయుర్వేద) డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలని సవరణ చేసారు. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రక్రియ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications