తిరుమలలో రేపు కన్నుల పండువగా..
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. శుక్రవారం నాడు 59,236 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,446 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.38 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
ప్రస్తుతం 15 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల్లో రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

కాగా- ఈ నెల 25వ తేదీన పౌర్ణమి గరుడ సేవ ఉత్సవాలను నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి వేడుకలు కావడం దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించడానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.
పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా సాయంత్రం వేళ- సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై విహరిస్తారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. గరుడాధీశుడై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం 7 గంటలకు ఈ వేడుకలు ఆరంభమౌతాయి. 9 గంటలకు ముగుస్తాయి.
ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. నేటితో ముగియనున్నాయి. నాలుగు రోజుల పాటు శ్రీమలయప్ప స్వామివారు పుష్కరిణీలో రాత్రి వేళ తెప్పపై విహరించారు. దేవేరులతో కలిసి వేర్వేరు అవతారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.
తొలిరోజు శ్రీరామచంద్రమూర్తి, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా పుష్కరిణిలో మూడు ప్రదక్షిణలు చేశారు. రెండో రోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారంలో తెప్పపై ఊరేగారు. మూడవ రోజున భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్కరిణిలో తెప్పపై భక్తులను అనుగ్రహించారు. నాలుగవ రోజున మలయప్ప స్వామివారు అయిదు ప్రదక్షిణలు చేశారు.
నేడు చివరి రోజు. ఇవ్వాళ కూడా మలయప్ప స్వామివారు పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణలు చేస్తారు. దీనితో తెప్పోత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవను టీటీడీ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20, 21 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవను రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications