టమాటాలతో తులాభారం; ఆ ఆలయంలో తంతు విచిత్రంగా చూసిన భక్తజనం!!
ఇటీవల కాలంలో టమాటాల ధరలు పెరగడం ఏమో గాని దేశవ్యాప్తంగా చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు టమాటా పంట పొలాలకు సెక్యూరిటీ గార్డులను కాపలా పెడుతుంటే, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని టమాటా పంటను రక్షించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇక టమాటా పంట దొంగతనాలు, మార్కెట్లలో కూడా టమాటాలను దొంగతనం చేసేవారు, పుట్టినరోజు వంటి శుభకార్యాలకు టమాటలను బహుమతిగా ఇస్తున్న సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక ఏకంగా దేవాలయాల్లోనూ మొక్కులు తీర్చుకోవటానికి టమాటాలు ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇక తాజాగా అటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన అప్పారావు మోహిని దంపతులు అమ్మవారికి అత్యంత విలువైన టమాటాలతో తులాభారం ఇచ్చారు. తాము అనుకున్నది జరిగితే కుమార్తె భవిష్య పేరు మీద నిలువెత్తు బంగారం అమ్మవారికి ఇస్తామని మొక్కుకున్న తల్లిదండ్రులు ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. ఇక టమాటాలు అంటే బంగారం అన్నట్టుగా చూస్తున్న చాలామంది టమాటాల తులాభారాన్ని విచిత్రంగా చూశారు.
అనకాపల్లి కి చెందిన అప్పారావు మోహిని దంపతుల కుమార్తె భవిష్యను తులాభారం వేసిన తల్లిదండ్రులు ఆలయం ఆవరణలో 51 కిలోల టమాటాలతో నిర్వహించారు. ఆ తర్వాత 51 కిలోల బెల్లంతో, ఆపై ఒక కిలోల పంచదారతో తులాభారం వేసి గుడిలో అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమానికి ఉపయోగించాలని ఆలయ అధికారులకు అప్పగించారు. ఇక నూకాలమ్మ అమ్మవారి భక్తులైన దంపతులు అత్యంత భక్తి భావంతో వేసిన టమాటాల తులాభారాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.
వీరు ఇచ్చినటువంటి టమాటాలు, బెల్లం, పంచదార లను అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటాల ధర కేజీ 150రూపాయల పైనే ఉండటంతో అంత కాస్ట్ లీ టమాటాలతో తులాభారం అనకాపల్లి మొత్తం చర్చించుకుంటున్నారు. ఇలా కూడా తులాభారం ఇవ్వొచ్చా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications