కాకినాడ జీజీహెచ్ లో కోవిడ్ తో ఇద్దరు మృతి-ఉమ్మడి తూ.గో జిల్లాలో భయాందోళనలు..
ఏపీలో కోవిడ్ ప్రభావం చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కూడా నిర్వహిస్తోంది. అదే సమయంలో కాకినాడ జిల్లాలో ఇవాళ రెండు కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ లక్షణాలతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో కాకినాడ జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది.
కాకినాడలో అక్కడక్కడా జ్వరాలు ఉన్నట్లు గుర్తిస్తున్నా.. సీరియస్ కోవిడ్ కేసులు మాత్రం అంతగా లేవనే చెప్పాలి. కానీకరోనా అలజడి లేని వేళ కాకినాడ జీజీహెచ్లో కోవిడ్ తో ఇద్దరు మరణించడం కలకలం రేపింది. ఊపిరితిత్తుల సమస్యతోపాటు న్యూమోనియో బారిన పడిన ఇద్దరు యువకులకు కొవిడ్ సోకడంతో కాకినాడ జి.జి.హెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మృతిచెందారు.

అల్లూరి సీతా రామరాజు జిల్లా వై.రామవరం మండలం ఎర్రగొండ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు మూడ్రోజుల క్రితం విషమ పరిస్థితిలో న్యూమోనియాతో కాకినాడ జీజీహెచ్ లో చేరాడు. సదరు యువకుడికి కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు నిర్దారించిన కాకినాడ జీజీహెచ్ డాక్టర్లు.. ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.

అలాగే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు అతిగా మద్యం సేవించడం తో క్లోమ గ్రంధి ఇన్ఫెక్షన్ మిగతా అవయవాలకూ వ్యాపించింది. ఇతనికి కూడా కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి నిర్వహించిన కొవిడ్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. మూడు రోజుల పాటు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి యువకుడు సోమవారం మృతి చెందాడు. ఈ రెండు కోవిడ్ మరణాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య బృందాలు అప్రమత్తమ్యాయి. కోవిడ్ మరణాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications