వెంకయ్యని కలిసిన టిడిపి ఎమ్మెల్యేలు: ఆనంపై ఆదాల
అనంతపురం/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసన సభ్యులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలు ఆదివారం కలిశారు. అనంతపురంలో జరిగిన నమో చాయ్ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యతో పయ్యావుల భేటీ అయ్యారు.
రాష్ట్రం రెండు ముక్కలైతే అనంతపురం జిల్లాకు జరిగే నష్టాన్ని ఈ సందర్భంగా వెంకయ్య దృష్టికి పయ్యావుల తీసుకొచ్చారు. సీమాంధ్రులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని వెంకయ్య చెప్పారని అనంతరం పయ్యావుల చెప్పారు. సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే తాము అంగీకరించమని వెంకయ్య హామీ ఇచ్చారన్నారు. పరిటాల సునీత కూడా ఆ తర్వాత భేటీ అయ్యారు.

చాయ్ అమ్మే వారు ప్రధాని కావొచ్చు: వెంకయ్య
చాయ్ అమ్మే వారు ప్రధానమంత్రి అయితే ఏమీ కాదని కానీ, దేశాన్ని అమ్ముకునే వారు మాత్రం కావొద్దన్నారు. కాంగ్రెసు పార్టీవి మాటలు తప్ప చేతలు లేవన్నారు. పేదరికం నుండి వచ్చిన మోడీకి దాని గురించి బాగా తెలుసునని చెప్పారు.
ఆనం సోదరులపై ఆదాల ఫైర్
ఆనం సోదరులపై రాజ్యసభ కాంగ్రెసు రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర రెడ్డి నిప్పులు చెరిగారు. ఆనం పగటి వేషగాడని ఎద్దేవా చేశారు. కెవిపి ప్రోత్సాహంతోనే ఆనం తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు తరఫున మరో 26 ఓట్లు తనకే పడతాయని భావిస్తున్నానని చెప్పారు.
ఆనం సోదరులు చేయని అరాచకం లేదన్నారు. ఓటు వేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలందర్నీ కలిశానని, ముఖ్యమంత్రిని కలిసి మిగిలిన ఓట్లు ఇవ్వాలని అడుగుతానని చెప్పారు. తాను సమైక్యాంధ్ర కోసం పోరాడటం లేదనేది అబద్దమన్నారు. విభజనవాదులు ఓడిపోతారనే నాలుగో అభ్యర్థిని పెట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications