కృపామణి ఆత్మహత్య: నలుగురు నిందితుల అరెస్ట్, దొరకని ప్రధాన నిందితుడు
ఏలూరు: సంచలనం రేపిన కృపామణి ఆత్మహత్య కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ, రాజ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కృపామణి తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వర రావులను ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు తణుకుకు చెందిన సాయి శ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, ద్విచక్ర వాహనం, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ కృపామణి సోదరుడు. మంగ అనే మహిళ నిందితులకు ఆశ్రయం ఇచ్చింది.
కాగా, తల్లిదండ్రులే వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నించడంతో ఆత్మహత్య చేసుకున్న కృపామణి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్ కోసం ఇంకా గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో గత నెల చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

ఆత్మహత్య చేసుకునే ముందు తాను అనుభవించిన నరకయాతనను బాధితురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సెల్పీ వీడియోలో తన వేదనను తెలియజేసింది. ఈ కేసు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో ఎస్పీ స్థాయి అధికారి నేరుగా రంగంలోకి దిగారు. పది రోజులకు పైగా కొనసాగిన వేటలో బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీ, రామలింగేశ్వరరావులతో పాటు ఆమె ఆత్మహత్యకు కారకులుగా భావిస్తున్న రాజ్ కుమార్, మంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్ కోసం పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications