హోదా అంటే బూతుకాదు, తెలంగాణలో తిడ్తున్నారని వెంకయ్య బాధ: ఉండవల్లి
హైదరాబాద్: ప్రత్యేక హోదా అంటేనే ఏదో బూతు మాట మాట్లాడినట్లుగా బిజెపి, టిడిపిలు భావిస్తున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం మండిపడ్డారు. ఆయన రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు టిడిపి కృషి చేస్తుందని, అందుకోసం మొదటి పదేళ్ల పాటు 3 శాతం పన్నుల మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత పదేళ్లు 50 శాతం పన్నుల మినహాయింపు, అటు తర్వాత పదేళ్లు 20 శాతం పన్నుల మినహాయింపు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.

ముప్పయ్యేళ్ల పాటు అంటూ మేనిఫెస్టోలో చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అంటే వెంకయ్య, చంద్రబాబులు పదేళ్ల పాటు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా పైన ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
తనను తెలంగాణలో తిడుతున్నారు, ఆంధ్రాలో పొగుడుతున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బాధపడ్డారని, కానీ తెలంగాణలో తిడుతున్నట్లుగా కనిపించలేదన్నారు. వెంకయ్య - చంద్రబాబు పరస్పరం ప్రశంసించుకోవడానికే సరిపోతోందని అభిప్రాయపడ్డారు.
ఏపీ అభివృద్ధికి ఒక్క చంద్రబాబు ఉన్నాడని వెంకయ్య పొగుడుతున్నారని విమర్శించారు. విభజన బిల్లులో అన్నీ స్పష్టంగా ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలన్నారు. ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధిని ఆశించి పనులు చేస్తే చరిత్రహీనులు అవుతారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications