ఎన్నికల వేళ జగన్ కు తలనొప్పిగా ఏపీలో ఆందోళనలు.. డీఎస్సీ కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మరోపక్క ఏపీలో ఆందోళనలు మిన్నుముడుతున్నాయి. మళ్లీ ఏపీలో అధికారంలోకి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న ఆందోళనలు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఒకపక్క అంగన్వాడీలు, మరోపక్క మున్సిపల్ కార్మికులు తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కటం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు.
Recommended Video

ఏపీ సీఎం నాలుగున్నర ఏళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఏపీలోని నిరుద్యోగులు రోడ్డెక్కారు. జనవరి మొదటి వారంలోగా డీఎస్సీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన డిఎస్సీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు ప్రదర్శిస్తూ ఆందోళన సాగించారు.
అయితే పోలీసులు నిరుద్యోగుల ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని అరెస్ట్ చేసినందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి మధురానగర్, మాచవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు వారిపై దాడి కూడా చేసినట్టు తమను కొట్టినట్టు డివైఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్నారు.
మెగా డీఎస్సీ పై మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హేతుబద్దీకరణ పేరుతో 2000 స్కూళ్లను మూసివేసారని 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని వారు మండిపడుతున్నారు.తక్షణం మెగా డీఎస్సీ ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications