ఏపీపై వెంకయ్య నాయుడు ఫోకస్ : భవిష్యత్ మార్గదర్శకం..!!
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ పైన మరోసారి ఫోకస్ పెట్టారు. ఉపరాష్ట్రపతిలో హోదాలో ఆయన మరోసారి ఏపీలో సంస్థల పురోగతి పైన సమీక్ష చేసారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య విపక్ష నేతగా ప్రత్యేక హోదాతో పాటుగా.. పోలవరంకు ప్రత్యేక హోదా.. పలు జాతీయ సంస్థలు ఏపీలో ఏర్పాటుకు నాడు పునర్విభజన బిల్లులో ప్రతిపాదించేలా కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి హోదాలో వాటి ఏర్పాటపైన శ్రద్ద చూపారు. కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి అయిన తరువాత అనేక సార్లు ఏపీలో విభజన చట్టం హామీల అమలు...ఏపీలో నిర్మాణాల పైన రివ్యూలు చేసిన ఆయన ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రులకు కీలక సూచనలు చేసారు.

ఏపీలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై
మరి కొద్ది రోజులు ఉపరాష్ట్రపతి గా ఆయన పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా, ఆయన కేంద్ర మంత్రులు..అధికారులతో ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై సమీక్ష చేసారు. వెంకయ్య నాయుడు పార్లమెంటులోని తన ఛాంబర్‌లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా, హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌లతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, ఇతర అధికారులు హాజరై ఆయా సంస్థల పురోగతిని వివరించారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.

కేంద్ర మంత్రులకు కీలక సూచనలు
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సొంతభవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో స్థలం కేటాయించిన నేపథ్యంలో దాని నిర్మాణానికి నిధుల కేటాయింపు గురించి వెంకయ్య నాయుడు ఆరా తీయటంతో పాటుగా..ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే దాని పైన చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉప రాష్ట్రపతితో సమావేశమయ్యారు. వారిద్దరి భేటీలో నెల్లూరులో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌కు చెందిన ప్రాంతీయ కేంద్రం, రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రాజెక్టుల అమలు విషయంలో ఇబ్బందులు ఏవైనా ఏర్పడితే.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో ఏర్పాటు అవుతున్న కేంద్ర సంస్థల నిర్మాణాల పురోగతి పైన సంస్థల వారీగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులతో
అందులో కేంద్ర విశ్వవిద్యాలయం.. ఐఐటీ తిరుపతి..ఐఐఎం విశాఖపట్నం..విశాఖ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్.. కర్నూలు ఐఐటీడీఎం..జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ వంటివి వివిధ స్థాయిలో ఉన్నాయి. అందులో.. ఐఐఎం విశాఖపట్నం ఈ ఏడాది నవంబర్ కు పూర్తయ్యే అవకాశం ఉంది. మంగళగిరి ఎయిమ్స్ లో 2019 మార్చి నుంచి ఓపీడీ ప్రారంభమైంది. రూ.1,618 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ క్యాంపస్‌లో తొలి దశ 100%, రెండో దశ 99% నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఆగస్టుకల్లా పూర్తవుతుందని అంచనా. దీంతో.. ఉపరాష్ట్రపతి పదవి వీడినా.. వెంకయ్య నాయుడు ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం..ప్రధానంగా ఈ కేంద్ర సంస్థల నిర్మాణాల పూర్తి విషయంలో తన చొరవ కొనసాగిస్తే..వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications