నిర్మలమ్మ పద్దే తప్పంటావా చెల్లెమ్మా ? నీవి కాకిలెక్కలంటూ పురందేశ్వరిపై సాయిరెడ్డి ఫైర్..
ఏపీలో అప్పులపై వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయానికి తాజాగా పార్లమెంటులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు వెల్లడిస్తూ ఓ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన తర్వాత ఇక విమర్శలు, ప్రతివిమర్శలకు చెక్ పడుతుందనుకుంటే అలా జరగకపోగా మరింత ముదిరింది.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.2,64 లక్షల కోట్లు అప్పులు భారం రాష్ట్రంపై ఉందని, ఈ భారం క్రమేణా పెరుగుతూ 2023 నాటికి అంటే వైసీపీ నాలుగేళ్ల పాలన తర్వాత రూ.4.41 లక్షలకు చేరిందని నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తాజాగా వెల్లడించారు. నాలుగేళ్ల వైకాపా పాలనలో మొత్తం మీద రూ.1.77 లక్షల కోట్లు అప్పుల భారం పడిందని చెప్పారు. అయితే ఈ ప్రకటన తర్వాత ఏపీ బీజేపీ ఛీప్ పురందేశ్వరి నిర్మలా సీతారామన్ చెప్పింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మాత్రమేనని, అసలు అప్పు రూ.10 లక్షల కోట్లకు పైగా ఉందన్నారు.

అంతే కాదు ఏపీ అప్పు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు పైగా ఉందంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానంటూ పురందేశ్వరి తాజాగా మరోసారి ప్రకటించారు. దీంతో వైసీపీ ఇరుకునపడింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా విమర్శలు చేస్తున్న సాయిరెడ్డి .. తాజాగా అప్పులపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఇవాళ ట్వీట్ చేశారు.

ఏపీ అప్పులపై పురందేశ్వరి తాజా విమర్శలపై స్పందించిన విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ లో స్వయంగా ఆర్ధికమంత్రే ప్రకటించినా పట్టించుకోకుండా ఏవో కాకిలెక్కలు చెబుతోంది చెల్లెమ్మ పురందేశ్వరి అంటూ ట్వీట్ చేశారు. నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటూ గాలి మాటలెందుకు అంటూ మరో విమర్శ కూడా చేశారు. ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం అన్నారు. బావ కళ్లల్లో ఆనందం కోసం కాదు, ఉన్న పార్టీ కోసం పనిచేయొచ్చుగా అంటూ సాయిరెడ్డి ఆమెకు చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications