విజయశాంతి సీక్రెట్ మిషన్: రాజీవ్ గాంధీపై సినిమా?
హైదరాబాద్: తెలంగాణ రాములమ్మ ఇటీవలి కాలంలో మౌనం వహించారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి చేస్తున్నారో కూడా ఏమీ తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఢిల్లీ కాంగ్రెసు నేతల చుట్టూ తిరిగారు. చివరికి కాంగ్రెసులో చేరిపోయారు. మెదక్ లోకసభ స్థానం సీటును ఆమె ఖాయం చేసుకునే కాంగ్రెసు పార్టీలో చేరినట్లు చెబుతున్నారు. అయితే, ఆ స్థానం నుంచి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ పోటీ చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.
ఏమైనా, విజయశాంతి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లు చెబుతున్నారు. ఆమె రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యోదంతాలపై సినిమా తీస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నికలు సమీపించేనాటికి ఆ సినిమా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పెద్దల ఆశీస్సులతో, కొంత మంది తెలంగాణ కాంగ్రెసు నేతల ప్రోత్సాహంతో ఆమె ఆ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.

రాజీవ్ గాంధీ హత్యోదంతంపై మలయాళంలో మమ్ముట్టీ హీరోగా మిషన్ 60 డేస్ అనే సినిమా వచ్చింది. అలాగే తమిళంలో కుట్రపత్రికాయ్ (చార్జిషీట్), కుప్పి (సైనైడ్ గుళిక) సినిమాలు వచ్చాయి. తమిళ సినిమాలకు భిన్నంగా మిషన్ 60 డేస్ ఉందని అంటున్నారు. దాన్నే మాతృకగా తీసుకుని విజయశాంతి శ్రీపెరంబుదూర్ పేర తెలుగు సినిమాను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి నటిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా పాగా వేయడానికి ఆ సినిమా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో విజయశాంతి ఆ సినిమాకు పూనుకున్నట్లు చెబుతున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఉదంతాల ద్వారా సానుభూతిని పొందవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు.
అయితే, విజయశాంతి నిర్మిస్తున్నట్లు చెబుతున్న శ్రీపెరంబుదూర్ సినిమాపై కచ్చితమైన సమాచారం అందడం లేదు. కానీ, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొంత మేర సినిమా షూటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. విజయశాంతి, ఆమె అనుచురులు పూర్తిగా ఈ సినిమా నిర్మాణంలో మునిగిపోయినట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications