కేశినేని నాని అలా- చిన్ని ఇలా, లోకేశ్ యాత్ర వేళ : ఏం జరుగుతోంది..!!
ఎన్నికల వేళ విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీకి బలమైన జిల్లాగా చెప్పుకొనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం యాత్ర ప్రవేశించింది. విజయవాడ నగరంలో లోకేశ్ యాత్ర కు మంచి స్పందన కనిపించింది. అయితే, ఈ యాత్రలో పార్టీ ఎంపీ కేశినేని నాని కనిపించ లేదు. నగరంలోని పార్టీలో నేతల మధ్య అనైక్యత మరోసారి బయట పడింది. ఈ సాయంత్రం గన్నవరం నియోజకవర్గం లోకి లోకేశ్ యాత్ర ప్రవేశించనుంది.
విజయవాడలో లోకేశ్ యాత్ర : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు విజయవాడలో ఆదరణ కనిపించింది. యువగళం యాత్ర 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. కృష్ణా జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

పాదయాత్రలో లోకేష్‌ను అడుగడుగునా గజమాలలతో స్వాగతించారు. బోట్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కృష్ణానదిలో పడవల్లో లోకేశ్ చిత్రపటాలతో ఆహ్వానం పలికారు. సంప్రదాయ బేతాళ, కోలాట, గరగ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథం సెంటర్ వద్ద వేలాది మంది కార్యకర్తలతో ఎదురేగిన బుద్ధా వెంకన్న లోకేశ్‌కు గదను బహూకరించారు.
యాత్రకు దూరంగా ఎంపీ నాని : లోకేశ్ తొలి రోజు యాత్రలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొనలేదు. కొంత కాలంగా పార్టీ నేతల తీరు పైన కీలక వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని లోకేశ్ యాత్ర సమయంలో దూరంగా ఉండటం ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో లోకేశ్ యాత్ర వేళ కేశినేని చిన్ని క్రియాశీలకంగా మారారు. పాదయాత్ర జిల్లాలో ప్రవేశించిన సమయం నుంచి ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి చిన్ని పర్యవేక్షి స్తున్నారు.
నాని యాత్రకు దూరంగా ఉండటం..చిన్ని యాక్టివ్ కావటంతో విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. లోకేశ్ యాత్ర పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, రైల్వేస్టేషన్ మీదుగా సెంట్రల్ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. పలు వర్గాలకు చెందిన ప్రజలతో లోకేశ్ మమేకం అయ్యారు.

గన్నవరం పై ఫోకస్ : ఈ రోజు లోకేశ్ తన యాత్రలో కార్మికులు, ముస్లిం, నగరాల సామాజిక వర్గ ప్రముఖులతో సమావేశం కానున్నారు. మధ్నాహ్నం పెనమలూరు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది. కామయ్యతోపులో స్థానికులతో సమావేశం అవుతారు. సిద్ధార్థ కాలేజీ, పోరంకి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ జరపనున్నారు. నిడమానూరు వద్ద గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించి..అక్కడే బస చేయనున్నారు.
రేపు (సోమవారం) గన్నవరం పరిధిలో యాత్ర కొనసాగనుంది. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వల్లభనేని వంశీ లక్ష్యంగా టీడీపీ గన్నవరం సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ రోజు చంద్రబాబు ను కలవనున్న వైసీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు రేపు లోకేశ్ బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications