ఆర్కే బీచ్‌లో భర్తకు షాకిచ్చి.. ప్రియుడితో నెల్లూరులో సాయిప్రియ
అమరావతి: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సోమవారం రోజున గల్లంతైన సాయిప్రియ బుధవారం నెల్లూరులో ప్రత్యక్షమైంది. తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఫోన్ చూసుకుంటుండగా భార్య సముద్రంలో కొట్టుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆర్కేబీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ నెల్లూరులో..
రెండ్రోజులపాటు తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం సాయిప్రియను నెల్లూరులో ఓ యువకుడితో గుర్తించారు. అయితే, ఆమె ఎందుకు వెళ్లింది? భర్తను విడిచిపారిపోయిందా? అసలేం జరిగిందనేది తెలియాల్సి ఉంది. అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సోమవారం రోజున తన భార్య సాయిప్రియ(21) అనే మహిళ గల్లంతైనట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి రోజున సరదాగా గడుపుదామని బీచ్‌కు వచ్చామని చెప్పాడు.

సముద్రంలో కొట్టుకుపోయిందనుకున్న భర్త
తాను ఫోన్ చూసుకుంటున్న సమయంలో తన భార్య సముద్రం వద్దకు వెళ్లిందని.. అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కాపాడబోయేలోగా ఆమె కంటికి కనిపించనంత దూరం కొట్టుకెళ్లిందని పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపుర, సాయిప్రియ ఆచూకీ కోసం కోస్ట్‌గార్డుకు చెందిన హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు నెల్లూరుతో ఓ యువకుడితో సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

భర్త కన్నుకప్పి సాయిప్రియ ప్రియుడితో..
భర్తతో ఆర్కే బీచ్ కు వెళ్లిన సాయిప్రియ భర్త కన్ను కప్పి మాయం అయ్యింది. భర్తపై అనుమానాలు కలిగేలా వ్యవహరించింది. ఈ క్రమంలో రవి అనే వ్యక్తితో సాయిప్రియకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా బయటపడింది. భర్త ఫోన్ చూస్తూ ఉండగా.. ఇంతలోనే సాయిప్రియ తప్పించుకుంది. భర్త ఫోన్ చూస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రియుడితో పరారైంది. భర్త శ్రీనివాస్ చూసేసరికి ఆమె కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ వ్యవహారంలో అంతా మొదట భర్తనే అనుమానించడం గమనార్హం. చివరకు సాయిప్రియ తన ప్రియుడితో కనిపించడంతో అసలు వ్యవహారం బయటపడినట్లయింది.












Click it and Unblock the Notifications