డిగ్గీతో వివేక్: పొత్తు కోసమా లేక గుడ్ బై చెబుతారా?

ఈ నేపథ్యంలో వారు ఢిల్లీ రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పొత్తు దిశగా తుది ప్రయత్నాలు చేసేందుకే వారు ఢిల్లీ వచ్చినట్లు చెబుతున్నా ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. పొత్తు విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని, రెండు పార్టీలు చేతులు కలపనిదే ఎన్నికల తర్వాత కూడా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, ఇప్పుడే చేతులు కలపడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
కేంద్రమంత్రి జైరాం రమేశ్‌తో వివేక్ శనివారం సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పొత్తుతో ఇరు వర్గాలకు ప్రయోజనం ఉంటుందని వివేక్ వాదించినా కెసిఆర్ వైఖరితో కాంగ్రెస్‌లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని జైరాం చెప్పారట. దీంతో, కెసిఆర్‌ను సుముఖంగా మార్చే బాధ్యతను తీసుకుంటానని వివేక్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తు చర్చలు ఆదివారం కొలిక్కి వస్తాయంటున్నారు.
మరోవైపు, వివేక్ సోదరులు తిరిగి సొంత గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొద్ది రోజులుగా అధినేత వైఖరిపై అసంతృప్తిగా ఉన్న వివేక్.. బుధవారం ఒకసారి.. శుక్రవారం ఒకసారి కెసిఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ తీరుపై స్పష్టత రావడంతో శనివారం ఢిల్లీలో దిగ్విజయ్, జైరాంలను కలిశారంటున్నారు. దిగ్విజయ్ నివాసంలో వివేక్ సోదరులను చూసిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని తెరాస ముఖ్యులకు చేరవేశారు. దీంతో, వారు పార్టీని వీడడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌తో పొత్తుకు తెరాసను ఒప్పించేందుకు ప్రయత్నించాలని భావించినా అంత సమయం లేదని చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల ఖరారుకు సమయం లేదని, ఏప్రిల్ మూడో తేదీలోపు అసెంబ్లీ, ఎంపీ జాబితాలను ఖరారు చేయాల్సిందేని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఆదివారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సోమవారం ఎంపీల జాబితాను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్‌కు పెద్దగా సమయం లేదని, సోమవారంలోపు పొత్తు విషయంపై ఆయన అటు కాంగ్రెస్‌నూ, ఇటు తెరాసను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారని, తెరాస తన వైఖరి మార్చుకోకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకు సాగితే.. వివేక్ సహా పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications