టీడీపీ, బీజేపీ పొత్తు వేళ కేంద్రం బిగ్ ట్విస్ట్ - చంద్రబాబు, పవన్ వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించాయి. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్నాయి. బీజేపీ ఈ వారంలోనే పొత్తులపైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పొత్తు నిర్ణయం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో, బీజేపీతో కలిసి ప్రయాణం పైన చంద్రబాబు, పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
స్టీల్ ప్లాంట్ లో మరో నిర్ణయం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణ అంశం కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం పైన వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రం ఈ నిర్ణయం పెండింగ్ లో పెట్టిందని బీజేపీ నేతలే చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు కేంద్రం స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో అమలు చేస్తున్న కొత్త ప్రణాళికలు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ సమర్థతకు పరీక్షగా మారుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కనీసం 1,500మందిని పలు కారణాలతో బయటకు పంపాలని చూస్తోంది. వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా గెంటేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ ఒత్తిడి పెంచుతున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందు కోసం కొత్తగా వాలంటరీ సెపరేషన్ స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసారు.
1500 ఉద్యోగుల తొలిగింపు దిశగా: కొద్దిరోజుల కిందట జరిగిన స్టీల్‌ప్లాంటు బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. ఫిబ్రవరి 2గా అమలుకు విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఆ తరువాత జరిగే బోర్డు మీటింగ్‌లో దీనిని అమలుకు చర్యలు చేపట్టనున్నారు. 30ఏళ్ల సర్వీసు దాటిన వారికి దీన్ని వర్తింపజేసి, వారికి ఇంకా మిగిలిన సర్వీసుకు బేసిక్ పే+డీఏ మొత్తం ఎన్ని నెలలైతే అంత ఇచ్చి పంపేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
దీని ద్వారా వెళ్లిపోయే ఉద్యోగికి పనిచేయకుండానే మిగిలిన సర్వీసుకు కొంత మొత్తం చేతికి వస్తుంది. ఇది ఉభయులకు లాభదాయకం కాబట్టి దీనిపై ఉద్యోగులు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో 2021లోనే వీఆర్‌ఎ్‌స అమలు చేశారు. ఇప్పుడు కూడా ఉక్కుశాఖ ఉద్యోగులను తగ్గించాలని అనుకుంటోంది. దీని కోసం ఈ సారి వీఆర్ఎస్ కాకుండా వాలంటరీ సెపరేషన్ స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించింది.

పొత్తుల పైన ప్రభావం: ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వరు. అంటే మిగిలిన సర్వీసుకు బేసిక్ పే, డీఏలు లెక్కించరు. కేవలం పదవీ విరమణ తర్వాత బీమా సదుపాయం, ఉచిత వైద్యం పొందే అవకాశం మాత్రమే కల్పిస్తారు. ఈ విధంగా ఆరోగ్యం బాగాలేని 700 మందిని, వీఎస్ఎస్ ద్వారా మరో 800మందిని కలిపి మొత్తంగా 1,500 మంది తగ్గించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
దీని పైన కార్మిక సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఏపీలో బీజేపీతో కలిసి పొత్తుకు టీడీపీ ముందుకు వెళ్తున్న వేళ ఈ నిర్ణయాలు ప్రభావం చూపుతాయనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అంశం పైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ న్యాయస్థానం ఆశ్రయించారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు- పవన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications