కిరణ్ ఒక్కరే, దిగ్విజయ్ వ్యాఖ్యలు తప్పు: శైలజానాథ్
ఒంగోలు/: సమైక్యం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాము అండగా నిలుస్తామని మంత్రి శైలజానాథ్ ఆదివారం చెప్పారు. ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే తాము ప్రత్యేక పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. సమైక్యం కోసం ఆయన ఒక్కరే పాటుపడుతున్నారని కితాబిచ్చారు. కిరణ్ రాష్ట్ర విభజనకు అంగీకరించాలన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఖండించారు.

కాంగ్రెసు అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకొని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాజ్యాంగానికి కొత్త సమస్యలు వస్తాయన్నారు. సమైక్యం కోసం ఉద్యోగులు సమ్మె చేస్తే రాజకీయాలకు అతీతంగా మద్దతిస్తామని తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రక్రియను శాస్త్రీయంగా సాగనివ్వడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో మాట్లాడారు. మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అధిష్టానానికి గులాంలుగా మారారన్నారు.












Click it and Unblock the Notifications