బాలయ్యకు సీటు ఇస్తాం, ప్రచారం చేయాల్సిందే: బాబు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపొందుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ కండువా కప్పి ఆహ్వానించారు. తన వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ పోటీ చేస్తానంటే శాసనసభ లేదా లోకసభ సీటు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. బాలయ్యతో పాటు అందరూ ప్రచారంలో పాల్గొనాల్సిందేనని ఆయన అన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలు కూడా టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారని చెప్పారు. అందువల్లే ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

మెజార్టీ ప్రజలు ఆమోదించిన వారికే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజల నాడీ తెలుసుననని, మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో పారదర్శక పాలన అందించామని చెప్పారు. టిడిపి అంటేనే పారదర్శక పాలనకు అభివృద్ధికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు.
ప్రజలు చైతన్యవంతులైతేనే అవినీతి అంతమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు.
కేంద్రమంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెబితే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ ఆయన మాటలను వ్యక్తిగతమని చెప్పారని అన్నారు. కాంగ్రెస్ వారి మాటలు ఇలాగే పారదర్శకంగా లేకుండా ఉంటాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అండమాన్, నికోబార్ దీవుల్లోనూ తమ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications