బెంబేలెత్తుతున్నారు? విభజనపై దారుణంగా: చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిలు కలుస్తాయనే వార్తల పైన కొన్ని పార్టీలు ఎందుకు బెంబేలెత్తుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ దేశానికి పట్టిన శని అని, నేరచరితులను కాపాడుతోందని మండిపడ్డారు. ప్రత్యర్థుల పైకి సిబిఐ, ఈడిలతో దాడులు చేయిస్తోందన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే లోక్‌పాల్ రావాలన్నారు. లోక్‌పాల్ బిల్లుకు టిడిపి మద్దతిస్తుందన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పిల్ల చేష్టలు ఇంకా పోలేదన్నారు. అన్నా హజారేను తాము రాష్ట్రానికి ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీని తరమికొట్టే వరకూ పోరాడాలన్నారు. అవినీతి కంపులో కూరుకుపోయిన కాంగ్రెస్ పాలనపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు. లోక్‌పాల్ బిల్లును తీసుకు రావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ఏ బిల్లునూ సక్రమంగా తీసుకు రాలేదని, ఏ విషయంలోనూ స్పష్టత ఉండదని మండిపడ్డారు.

లోక్‌పాల్ బిల్లు 90 శాతం పూర్తయిందని, అందరూ సహకరిస్తే మిగతా పూర్తవుతుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో ఇంకా పిల్ల చేష్టలు పోలేదని అర్థమవుతోందన్నారు. సుప్రీంకోర్టు నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పాల్గొనరాదని తీర్పు చెబితే, దానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌ను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్‌దే అన్నారు. స్విస్ బ్యాంకులో రూ.75 లక్షల కోట్లు నల్లధనం ఉందని ఈ విషయం చెప్పడానికి ఆ బ్యాంకు వర్గాలే సిగ్గుపడ్డాయన్నారు.
సిబిఐ, ఈడిలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేధిస్తుందని, అనుకూలంగా మారితే జైల్లో నుంచి బయటకు తెస్తారంటూ జగన్‌ను ఉదహరించి అన్నారు. జగన్ కాంగ్రెస్ డిఎన్ఎ అని దిగ్విజయ్ చెప్పారని, అందుకే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చారన్నారు. అలాగే కెసిఆర్‌కు ప్యాకేజీలిచ్చి ఆయనను దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందరు కలిసి తెలుగుజాతిని సర్వనాశనం చేస్తున్నారన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు ఎప్పటి నుంచో పరిచయమని, వారితో పాటు బిజెపి అగ్రనేతలు ముందు నుంచీ తెలిసిన వాళ్లే అన్నారు. వారి ఆహ్వానం మేరకే మధ్యప్రదేశ్ వెళ్లానని చెప్పారు. రాష్ట్రంలోని, దేశంలోని పరిస్థితులన్నింటినీ మధ్యప్రదేశ్ పర్యటనలో అక్కడి నేతలతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపికి, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ పార్టీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఘనత ఉన్నదన్నారు.
రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ దారుణంగా ముందుకు పోతోందన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని, హైదరాబాద్‌లో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ చేతిలో ఉండడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. సాగునీటి పంపిణీపై కొత్తగా బోర్డులు వేయడం ఏమిటన్నారు. భాగస్వామ్యులందరితో చర్చించి సమన్యాయం చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications