ఇసుంత రమ్మంటే, హైదరాబాద్ వదిలి వెళ్లండి: హరీష్
హైదరాబాద్: గవర్నర్‌కు హైదరాబాద్ పైన ప్రత్యేక అధికారాలు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోతే ఇప్పటికిప్పుడు కార్యాలయాలు లేవని, నాలుగు రోజులు తలదాచుకుంటామని సీమంధ్ర నాయకులు అంటే తాము ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామని కానీ వారు ఇసుంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ చేతికి అప్పగించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రేనని, కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని తెలంగాణపై సీమంధ్ర పెత్తనాన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీమంధ్ర నాయకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే పన్నాగం పన్నారని, ఇది అత్యంత దుర్మార్గమని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజమన్నారు.

ఈ కుట్రలను తెలంగాణ సమజం తిప్పికొడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ నెల రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క సీమంధ్ర పౌరుడికి ఎలాంటి హానీ జరగలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కూడబెట్టిన అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికి, అక్రమ భూదందాలను కొనసాగించటానికే తెలంగాణపై సీమంధ్ర పెత్తనాన్ని రుద్దాలనుకుంటున్నారని ఆరోపించారు. మాపై నమ్మకం లేకుంటే హైదరాబాద్ వదిలి వెళ్లిపోండని, అంతే తప్ప మీ పెత్తనం కొనసాగించాలనుకుంటే మత్రం సహించేది లేదన్నారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతల నిర్వహణ పేరిట గవర్నర్‌కు అధికారాలు ఇవ్వటం అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళ్లూ చేతులు కట్టేయటమేనన్నారు. హైదరాబాద్‌లో అక్రమార్కుల గుండెల్లో తమ ప్రభుత్వం రైళ్లు పరుగెత్తిస్తుండటం వల్లనే కేంద్రం చంద్రబాబుకు దాసోహమని అధికారిక కట్టడికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో 28 రాష్ట్రాల్లో లేనటువంటి చట్టాలు, నిబంధనలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకని, ఇది రాజ్యంగం, చట్ట విరుద్దమన్నారు.












Click it and Unblock the Notifications