షాకింగ్: రేవంత్ 8మందికి గాలం, కేసీఆర్‌ను పడగొట్టేందుకేనా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పైన ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షిలో సంచలన కథనం వచ్చింది. చంద్రబాబు సూచన మేరకే రేవంత్ బేరసారాలు జరిపారని, టీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానని హామీ ఇచ్చినందువల్లే అలా చేశారని, ఆయన సూచన మేరకే ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే వ్యూహం పన్నారని కథనం వచ్చింది.
తెరాస, కాంగ్రెస్ పార్టీలలో తనకు తెలిసిన ఎమ్మెల్యేలతో మాట్లాడి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన సూచించిన అభ్యర్థికే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారని పేర్కొంది.
తెరాస, కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆర్థిక వనరులు సమకూరుస్తారని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మొత్తంగా ఎనిమిది మందికి గాలం వేసినట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి రెండు ఓట్లు తక్కువగా ఉన్నాయి. టీడీపీ, మద్దతిస్తున్న బీజేపీ నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో 20 మంది గెలిచారు. అయితే, ఐదుగురు సభ్యులు తెరాసలో చేరారు. మిగిలిన వారు పదిహేను మంది. ఎమ్మెల్సీ గెలిచేందుకు మరో రెండు ఓట్లు అవసరం.
ఈ నేపథ్యంలో రేవంత్ రెండు ఓట్లకు పరిమితం కాకుండా ఎనిమిది ఓట్లకు గాలం వేశారని, వారిలో అత్యధికులు ఆమోదయోగ్యంగా ఉన్నారని సమాచారం ఇచ్చారని రాసింది. కాగా, ఒక్క ఎమ్మెల్సీని గెలిపిస్తే తనకు తిరుగు ఉండదనుకున్న రేవంత్ చివరకు అమాయకంగా చిక్కారని అంటున్నారు.












Click it and Unblock the Notifications