కిరణ్ ఏం చేస్తారు: సమైక్య ఛాంపియన్ లీకిచ్చినా చాలు!

Will Kiran Kumar Reddy float new party?
హైదరాబాద్: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో చేరలేని పలువురు కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కిరణ్ మనసులో ఏముందో కనీసం లీక్ ఇచ్చినా చాలని లేదంటే వచ్చే ఎన్నికల నాటికి తమ పరిస్థితి గందరగోళంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. కిరణ్ కొత్త పార్టీ పైన నేరుగా చెప్పకున్నా పరోక్షంగా సంకేతాలు ఇచ్చినా ఫరవాలేదని భావిస్తున్నారట.

లేదంటే ఇష్టం లేకపోయినప్పటికీ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ముఖ్యమంత్రికి సీమాంధ్రలో అనూహ్య ఆదరణ పెరిగిందని, ఆయన ఛాంపియన్ అయ్యారని కాంగ్రెసు నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెసు తమను లెక్క చేయనందున చాలామంది కాంగ్రెసు నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారట.

కిరణ్ పార్టీ కోసం పలువురు ఎదురు చూస్తున్నారట. వివిధ కారణాల వల్ల ఇతర పార్టీల్లో చేరలేని, కాంగ్రెస్‌లో కొనసాగలేని వారు ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం ఓడించి తీరాలని కిరణ్ పట్టుదలతో ఉన్నారు. ముసాయిదా బిల్లును కూడా వ్యతిరేకించి, సవరణలు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. అప్పటికీ కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే వెంటనే పదవికి, పార్టీకి కిరణ్ రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.

విభజనపై కాంగ్రెసు దూకుడుగా వెళ్తున్నందున ఆ పార్టీకి సీమాంధ్రలో నూకలు చెల్లినట్లేనని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి అందరం మూకుమ్మడిగా బిజెపిలో చేరడం మేలని ఇటీవల అన్నారు. తమ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెసు నిర్ణయం నేపథ్యంలో కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇంకొందరు టిడిపిలో కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు.

ఇంకొందరు మాత్రం సమైక్య నినాదంతో కొత్త రాజకీయ పార్టీ వస్తేనే అంతో ఇంతో రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య వాణిని బలంగా వినిపించే నేతగా కిరణ్ ఒక్కరే వారికి కనిపిస్తున్నారు. ఫైలిన్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన కిరణ్‌కు యువత నుంచి విశేషాదరణ లభించింది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 'సమైక్యాంధ్ర సింహం వర్ధిల్లాలి, రాష్ట్ర విభజనను అడ్డుకునే పులి.. కిరణ్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.

విభజన తుఫానును అడ్డుకుంటానని ఆయన అన్నప్పుడు కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చవఎం హోదాలో ఉంటూ.. అధిష్ఠానాన్ని గట్టిగా ఎదుర్కొంటూ సమైక్య వాదాన్ని బలంగా వినిపిస్తోన్న కిరణ్‌కు సీమాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఊహిస్తూ వచ్చారు. కానీ, యువత నుంచి ఈ స్థాయిలో ఆదరణను వారు కూడా ఊహించలేదు. ప్రస్తుత తరుణంలో కిరణ్ సమైక్య నినాదంతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తే బాగుంటుందని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.

సీమాంధ్రలో తాజా రాజకీయ పరిణామాలపై ఇటీవల కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓ సర్వే నిర్వహించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుంటే టిడిపి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇక, వ్యక్తుల వారీగా నిర్వహించిన సర్వేలో సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తోన్న కిరణ్ అందరికంటే ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో జగన్, మూడో స్థానంలో చంద్రబాబు ఉన్నారని కాంగ్రెస్ వారు కొందరు చెబుతున్నారు.

ఈ తరుణంలో ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత, కొత్త పార్టీని స్థాపిస్థానంటూ కిరణ్ పరోక్షంగానైనా చెబితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితిని గ్రహించిన సీమాంధ్ర నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జిల్లాలకు జిల్లాలే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ పైన కొత్త పార్టీ స్థాపనకు ఒత్తిడి తెచ్చామని, ఆయన సానుకూలంగా స్పందించట్లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+