చంద్రబాబు చేయలేని పని పవన్ చేశారా ? ప్లస్సా ! మైనస్సా ?
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై విమర్శల డోస్ పెంచేస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్ధి శిబిరాల్ని కలవరపెట్టే ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయం మారిపోయిన నేపథ్యంలో అధికార పార్టీని ఎన్నికల ముందు ఇరుకునపెట్టేందుకు టీడీపీ,జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.
ఏపీలో ఎవరు అవునన్నా, కాదన్నా వాలంటీర్ల వ్యవస్ధను తీసుకొచ్చిన అధికార వైసీపీకే వారి మద్దతు ఉంటుంది. అంతే కాదు వాలంటీర్ల వ్యవస్ధను అమల్లోకి తెచ్చిన తర్వాత వైసీపీ నేతలు చెప్పినట్లుగా వింటూ తమను టార్గెట్ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్ధపై తీవ్ర విమర్శలు చేసేవారు. వాటిలో వాలంటీర్లు ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారిని ఇబ్బందిపెడుతున్నారని ఆరోపణలు చేశారు. వీటిపై వాలంటీర్లతో పాటు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో చంద్రబాబు మౌనం వహించారు.

ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వాలంటీర్లతో వైసీపీ బంధంపై కానీ, వాలంటీర్ల గురించి కానీ చంద్రబాబు మాట్లాడే పరిస్ధితి లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.18 వేల చొప్పున ఇస్తామని అక్కడక్కడా టీడీపీ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబు మిత్రుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వాలంటీర్లు ఇచ్చే డేటా ఆధారంగా మహిళలు అదృశ్యం అవుతున్నారంటూ పవన్ చేసిన విమర్శలతో దుమారం రేగింది.
ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుబడుతున్నా ఆయన మాత్రం నిన్న కూడా వెనక్కి తగ్గలేదు. తాను తప్పుచేసిన కొందరి గురించే మాట్లాడుతున్నా అంటూ వాటిని సమర్ధించుకున్నారు. దీంతో చంద్రబాబు తాను చేయలేని విమర్శల్ని మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో చేయిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే పవన్ విమర్శల ఉద్దేశం ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో ఏదో విధంగా కీలకంగా మారే వాలంటీర్ల వ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు మైనస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు ఈ ప్రభావం చంద్రబాబుపైనా పడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications