వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా దూకుడే: చంద్రబాబును జగన్ ఎదుర్కోగలరా?

చంద్రబాబును జగన్ ఎదుర్కుని వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటగలరా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబు వ్యూహం ముందు ఆయన నిలబడుతారా అనేది కూడా ప్రశ్నే...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఆయనకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ఎత్తులకు పైయెత్తులు వేస్తూనే ఉన్నారు.

చంద్రబాబు అనుభవం, వ్యూహరచన ముందు జగన్ నిలబడుతారా అనే ప్రశ్న ఎదురవుతోంది. పైగా అధికారం కూడా చంద్రబాబుకు చేతిలో ఉంది. రాష్ట్రానికి తాను చాలా చేస్తున్నాననే విధంగా చంద్రబాబు కార్యకలాపాలు ఉంటున్నాయి. హైదరాబాదు నుంచి రాజధానిని అమరావతికి మార్చడంలో ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు. వచ్చే శాసనసభ సమావేశాలు కూడా అమరావతిలోనే జరగనున్నాయి.

ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదనే వాదనను జగన్ ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. చంద్రబాబుకు అందుకు సంబంధించిన ఆయన లేఖాస్త్రాలు సంధించడం కూడా ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రస్తుతం రోజా ఒక్కరే దూకుడగా కనిపిస్తున్నారు. ఇటీవల ఆమెను గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేయడం, ఆ తర్వాతి హంగామా ఏ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.

జగన్ వ్యూహం ఏమై ఉంటుంది...

జగన్ వ్యూహం ఏమై ఉంటుంది...

వైయస్ జగన్ ప్రస్తుతం ప్రధానంగా ప్రత్యేక హోదాను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రాజీ పడడంవల్లనే కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని ఆయన అంటున్నారు. ప్రత్యేక హోదాను సెంటిమెంట్‌గా మార్చిన జగన్ దాని వేడిని ఎన్నికల వరకు నిలుపగలరా అనేది ప్రశ్న. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తూ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏమి ఉందని తెలుగుదేశం పార్టీ అంటోంది.

హోదాపై చంద్రబాబు వాదన ఇదీ...

హోదాపై చంద్రబాబు వాదన ఇదీ...

కేంద్రంతో సఖ్యతగా లేకపోతే ఈ మాత్రం కూడా రాబట్టుకోలేమని, అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు వాదిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ హోదా కన్నా మెరుగైంది కాబట్టే తాము అంగీకరించామని ఆయన చెబుతున్నారు. అటువంటప్పుడు హోదా అయితేనేం, ప్యాకేజీ అయితేనేం అంటున్నారు. పైగా, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందువల్ల జగన్ ప్రత్యేక హోదా వేడిని చివరంటా కొనసాగించగలరా అనే అనుమానాలు ఎదురవుతున్నాయి.

 రోజా ఇష్యూ ప్రయోజనం కలిగిస్తుందా...

రోజా ఇష్యూ ప్రయోజనం కలిగిస్తుందా...

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రోజా ఒక్కరే చంద్రబాబు ప్రభుత్వంపై ఎడతెరిపి లేని సమరం సాగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు తనను ఆహ్వానించి అరెస్టు చేయడం ద్వారా అవమానించారని ఆమె వాదిస్తున్నారు. రోజాకు ఆహ్వానం వెళ్లిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా అంగీకరించారు. అయితే, నిఘా విభాగాల సమాచారం మేరకు అల్లరి చేస్తారనే ఉద్దేశంతో రోజాను అరెస్టు చేయాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. రోజాపై ప్రధానంగా అనిత, తదితర మహిళా తెలుగుదేశం నాయకులు ఎదురు దాడికి దిగారు. రోజా ఇష్యూ జగన్‌కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితే ఉంది.

జగన్‌పై కేసులో టిడిపి ప్రధాన అస్త్రం

జగన్‌పై కేసులో టిడిపి ప్రధాన అస్త్రం

వైయస్ జగన్‌పై ఉన్న కేసులను తెలుగుదేశం పార్టీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఆంధ్ర శశికళగా జగన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. జగన్ జైలుకు పోవడం ఖాయమని కూడా భాష్యాలు చెబుతున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, వాటిని ప్రజలు ఏ మేరకు నమ్ముతారనేది ప్రశ్న. రాజకీయాల్లో ఉన్నవారెవరైనా సంపాదిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందా, లేదా అనేది, తమకు ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతున్నాయని మాత్రమే ప్రజలు ఆలోచిస్తున్నారు.

ఎవరి మాటా జగన్ వినడు...

ఎవరి మాటా జగన్ వినడు...

వైయస్ జగన్ ఎవరు చెప్పినా వినరనే అభిప్రాయం బలంగా ఉంది. ఆయనకు నచ్చింది మాత్రమే చేస్తారు. ఆయన చెప్పినట్లు మాత్రమే మిగతా నాయకులు నడుచుకోవాలి. వ్యూహ రచనలో ఎవరి పాత్ర కూడా ఉండదని అంటారు. దానివల్ల ఆయనకు సలహాలు ఇచ్చేవారు లేకుండా పోయారనే అభిప్రాయం ఉంది. అది పార్టీకి ఉపయోగపడేది కాదని అంటారు.

అలా ఉంటే పవన్ కల్యాణ్ వచ్చారు...

అలా ఉంటే పవన్ కల్యాణ్ వచ్చారు...

చంద్రబాబును ముఖాముఖి ఎదురుకుందామని జగన్ అనుకుంటే పవన్ కల్యాణ్ రంగంలోకి వచ్చారు. దాంతో జగన్‌కు కాస్తా ఇబ్బందే. పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల్లో పోటీ పడితే ఓటర్లు చీలిపోయి జగన్‌కు నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. రాయలసీమలో ఏదో విధంగా నెగ్గుకుని వచ్చినప్పటికీ ఆంధ్రలో పవన్ కల్యాణ్ వల్ల భారీగా నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కుల ప్రాతిపదికపై ఓట్లు చీలే అవకాశం ఉండడంతో జగన్‌పై దెబ్బ పడే అవకాశం ఉంది.

చంద్రబాబుతోనే బిజెపి...

చంద్రబాబుతోనే బిజెపి...

చంద్రబాబు బిజెపితోనే కలిసి నడవాలని అనుకుంటున్నారు. బిజెపి కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రంతో సఖ్యంగా ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు చేయగలుగుతున్నామని చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలుగుతున్నారు. పైగా, తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే జట్లు, జగన్‌ను ఎదుర్కునే జట్లు చంద్రబాబుకు బలంగా ఉన్నాయి. ఇది జగన్‌కు మైనస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అండదండలు చంద్రబాబుకు పుష్కలంగా ఉన్నట్లు చెబుతారు. దాంతో బిజెపి చంద్రబాబుకు సహకరించే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఓ వైపు అనుభవం.. మరో వైపు అనుభవరాహిత్యం...

ఓ వైపు అనుభవం.. మరో వైపు అనుభవరాహిత్యం...

చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వ్యూహంలో దిట్ట అనే పేరు కూడా ఆయనకు ఉంది. పలు సందర్భాల్లో ఆయన వ్యూహరచన, దాని అమలు ఫలితాలను సాధించి పెట్టాయి. నాదెండ్ల భాస్కర రావు సృష్టించిన సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీని బయటపడేయడంలోనూ, ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడంలోనూ ఆయన వ్యూహమే పనిచేసిందని అంటారు. మరోవైపు జగన్‌కు రాజకీయానుభవం చాలా తక్కువ. అనుభవం గల నాయకులు ఇచ్చే సలహాలను ఆయన వినరని అంటారు. దానివల్ల చంద్రబాబు వేసే ఎత్తులకు పైయెత్తులు వేయడంలో జగన్ ఏ మేరకు విజయం సాధిస్తారనేది చెప్పలేం.

English summary
Will YSR Congress party president YS Jagan able to face Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X